నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్న దీదీ

Mamata Banerjee to fight from Nandigram in West Bengal

సీఎం మమతా బరిగీశారు. అన్న మాట ప్రకారం పంతానికి సై అన్నారు. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని శుక్రవారం స్వయంగా ప్రకటించారు. దీంతో సందిగ్ధానికి తెర పడినట్టైంది. ‘‘నేను నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నాను. అన్న మాటకు కట్టుబడ్డాను. ఈ ఎన్నికలు నాకు నల్లేరు మీద నడకే. ఆహ్లాదకర వాతావరణంలోనే జరుగుతాయి.’’ అని మమత ప్రకటించారు. మరోవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయను బరిలోకి దించుతున్నట్లు ఆమె ప్రకటించారు. మరోవైపు 294 స్థానాలకూ అభ్యర్థులను సీఎం మమత ప్రకటించారు.291 స్థానాల్లో తృణమూల్ బరిలోకి దిగుతుండగా, 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది మమత. అయితే 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఈ సారి మమత టిక్కెట్లను నిరాకరించారు. ఈ జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 70 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలు ఉన్నారు. ఈ నెల 10 న నామినేషన్‌ను దాఖలు చేస్తానని ప్రకటించారు. ఈ జాబితాకు తుది మెరుగులు దిద్దడానికి సీఎం మమత పలు దఫాలుగా సీనియర్లతో సమావేశమయ్యారు. అయితే ఈ జాబితా పూర్తిగా సీఎం మమత కనుసన్నల్లోనే జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సిట్టింగ్‌లకు ఈసారి మమత షాకిచ్చారు. 28 మంది సిట్టింగ్‌లకు మమత మొండి చేయి చూపారు. దీంతో వారందరూ బీజేపీ వైపు చూస్తారా? లేక ఇతర పార్టీల వైపు వెళ్తారా? అన్నది స్పష్టత రాలేదు.

ఎవరు ఎక్కడి నుంచే అంటే....

1. జూన్ మాలియా (మిడ్నాపూర్) (నటుడు)
2. మనోజ్ తివారీ (శిబ్‌పూర్, క్రికెటర్)
3. ఇద్రిస్ అలీ (ముర్షిదాబాద్)
4. రాజ్ చక్రవర్తి (బైరక్‌పూర్ (డైరెక్టర్)
5. సాయంతికా బెనర్జీ (బాంకురా) (నటుడు)
6. కంచన్ మలిక్ (ఉత్తర్‌పాడా) (నటుడు)
7. శోభాన్‌దేవ్ ఛటోపాధ్యాయ (భవానీపూర్)
8. అదితీ మున్షీ (రాజర్‌హాట్) గాయకుడు
9. సాయోని ఘోష్ (అసన్‌సోల్ సౌత్)
10. సోహమ్ చక్రవర్తి (చాందీపూర్) (నటుడు)

సువేందు వర్సెస్ మమత

సువేందు అధికారి ఎప్పుడైతే తృణమూల్‌ను వీడారో... అప్పటి నుంచి బెంగాల్ రాజకీయం వేడెక్కింది. సీఎం మమతకు అత్యంత సన్నిహితుడిగా సుబేందు పేరుగడించారు. నందిగ్రామ్‌లో తృణమూల్ అంతలా పటిష్టమైందంటే దానికి కారణం సుబేందుయే. సెజ్ ల విషయంలో తృణమూల్ నందిగ్రామ్ వేదికగా పెద్ద ఉద్యమమే నడిపింది. ఈ ఉద్యమంతో లెఫ్ట్ పునాదులే కదిలిపోయాయి. ఇదంతా నెరిపింది సుబేందుయే. అంతటి సుబేందు హఠాత్తుగా బీజేపీలోకి మారిపోయారు. దీంతో బీజేపీ రాజకీయంగా మమతను దెబ్బతీసింది. వచ్చే ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని మమత ప్రకటించారు. దీనికి ప్రత్యర్థి సుబేందు కూడా సై అన్నారు. మమతను 50,000 మెజారిటీతో ఓడించి తీరుతానని సుబేందు సవాల్ విసిరారు. లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతానని విస్పష్టంగా ప్రకటించారు. ఎన్నికలు వస్తేనే మమతకు నందిగ్రామ్ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. అయితే మమత భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా బరిలోకి దిగుతారని అందరూ భావించారు. చివరకు నందిగ్రాం నుంచే బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

బీజేపీ మాత్రం సుబేందును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గురువారం సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అయితే నందిగ్రాం నుంచి సుబేందును దించే విషయంపైనే  ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఈ నిర్ణయాన్ని కోర్ కమిటీ ప్రధాని మోదీకే వదిలేసింది. ఈ విషయంలో ఆయన మాటే ఫైనల్ అని తెలిపింది. మరోవైపు భవానీపూర్ నుంచి తాను బరిలోకి దిగుతానని కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో స్వచ్ఛందంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే సుబేందు మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘తృణమూల్‌కు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దా. కచ్చితంగా మమతను ఓడిస్తా. 50,000 ఓట్ల తేడాతో ఓడించి తీరుతా.’’ అని మోదీ,షా, నడ్డాతో ధీమాగా ప్రకటించారని తెలుస్తోంది.

 


                    Advertise with us !!!