
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్యాడ్ సమావేశంలో ఆ ఇద్దరు నేతలు కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. క్యాడ్లోని సభ్యదేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా త్వరలో భేటీ కానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. చైనా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు క్యాడ్ గ్రూపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల డ్రాగన్ దేశంతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కయ్యానికి దిగాయి. పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలు విభేదాలు వ్యక్తం చేశాయి. ఇటీవల సరిహద్దు అంశంలో భారత్‌లోనూ చైనా తగాదాకు దిగిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఓసారి ఫోన్లో సంభాషించారు. కానీ తొలిసారి ఆ ఇద్దరి మధ్య వర్చువల్ భేటీ జరగనున్నది. ఈ మీటింగ్‌కు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ క్యాడ్ సదస్సుకు బైడెన్ హాజరు అవుతారని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. దీని వల్ల బైడెన్, మోదీ మధ్య బేటీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, రక్షణ కోసం నాలుగు దేశాలు పనిచేయనున్నట్లు స్కాట్ తెలిపారు.