
ప్రజలు సుఖంగా జీవించేందుకు దేశంలో ఏఏ నగరాలు బెస్ట్ అనే అంశంపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రతి ఏటా ఓ సర్వే చేపడుతూ ఉంటుంది. ఆయా పట్టణాలు, నగరాల్లోని వసతులు, ప్రజల జీవన ప్రమాణాలు, పారిశుద్ధ్యం, రవాణా, వినోదం, పర్యావరణం, ఇంధనం... లాంటి అనేక అంశాలను ఆధారంగా తీసుకుని ఈ సర్వే చేస్తారు. ప్రజల జీవన నాణ్యతకు, ఆర్థిక సామర్థ్యానికి, సుస్థిరతకు ఈ సర్వే అద్దం పడుతూ ఉంటుంది. 2020 జనవరి నుంచి మార్చి వరకూ ఈ సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ప్రతి నగరమూ పోటీ పడింది.
తాజాగా విడుదలైన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. దేశంలో ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించదగ్గ నగరాల్లో బెంగళూరుదే ఫస్ట్ ప్లేస్. పదిలక్షలకు పైబడిన నగరాల్లో.. అంటే మెట్రో నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ప్లేస్ దక్కించుకోగా, పుణె సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్ టెన్ లో నిలిచాయి. ఇందులో హైదరాబాద్, కోల్ కతలకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ కు 24వ స్థానం దక్కింది. దీనిపై హైదరాబాద్ వాసులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక పది లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో తెలుగురాష్ట్రాల నుంచి కాకినాడకు స్థానం దక్కింది. ఇదొక్కటే కాస్త సంతోషించదగ్గ విషయం. ఈ కేటగిరీలో కాకినాడకు 4వ స్థానం దక్కింది. ఫస్ట్ ప్లేస్ లో సిమ్లా నిలవగా, సెకండ్ ప్లేస్ లో భువనేశ్వర్, మూడో స్థానంలో సిమ్లా నిలిచాయి. ఆ తర్వాత సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావణగెరె, తిరుచిరాపల్లి నిలిచాయి.
పది లక్షల జనాభా పైబడిన మున్సిపాలిటీల్లో విశాఖపట్నం స్థానం దక్కించుకుంది. విశాఖకు పదో ప్లేస్ దక్కింది. ఈ కేటగిరీలో ఇండోర్ ఫస్ట్ ప్లేస్ లో, సూరత్ సెకండ్ ప్లేస్ లో, భోపాల్ మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత పింప్రి, చించివాడ్, పుణె, అహ్మదాబాద్, రాయపూర్, గ్రేటర్ ముంబై, విశాఖ నిలిచాయి.
పది లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతి టాప్ టెన్ లో నిలిచింది. ఈ కేటగిరీలో న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తిరుపతి సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పుర్, బిలాస్ పూర్, ఉదయ్ పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి.
ఓవరాల్ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు పెద్దగా చోటు దక్కించుకోలేకపోయాయి. దీనిపై తెలుగు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరాలు, పట్టణాల ఎంపికపై అనేక ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.