సమస్యల వలయంలో జనసేన, బయటకు లాగండి సారూ...!

Jana Sena s reach in rural AP is growing says Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపిన సంగతి అందరికీ అర్థమవుతుంది. అయితే జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం ఏంటి అనే దానిపై మాత్రం చాలా వరకు స్పష్టత రావడం లేదు. ప్రస్తుతానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని అంశాల్లో వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2014 తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టి ఒక్క ఏడాది కూడా ప్రజల్లో తిరిగిన పరిస్థితి లేదని చెప్పాలి. ప్రతిపక్షంగా మేము బలంగా ఉన్నామని జనసేన పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక జనసేన పార్టీ నేతల మధ్య సమన్వయం కూడా పెద్దగా లేదనే చెప్పాలి. పార్టీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్దగా ఎవరూ నేతలు ముందుకు రావడం లేదు.

ఒకరిద్దరు నేతలు వచ్చినా సరే వాళ్లను భారతీయ జనతా పార్టీ నేతలు కట్టడి చేస్తున్నారనే ఆవేదన జనసేన పార్టీ నేతల్లో కూడా వ్యక్తమవుతుంది. జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండగా వాళ్ళను కార్యకర్తలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనసేన పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను దాదాపుగా నాదెండ్ల మనోహర్ చేతిలో పవన్ కళ్యాణ్ పెట్టారు.

 దీంతో కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అంతగా పరిస్థితులు ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారీ కూడా కాపు సామాజికవర్గ నేతలు గురించి గొప్పగా పదేపదే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీనితో కొంతమంది ఇతర సామాజికవర్గాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కమిటీలను నియమించే విషయంలో అలాగే జిల్లా కమిటీలు నియమించుకునే విషయంలో రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకపోవడం తో పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి.

భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచన పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారు అనేది కూడా ఇప్పటివరకు జనసేన పార్టీ నేతలకు గాని కార్యకర్తలకు గానీ స్పష్టత లేదు. ఆయన కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా చచ్చిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ పార్టీతో ముందుకు వెళ్లడం వల్ల ఆయనకు కలిసి వచ్చేది ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలలో ఉన్న అనేక అనుమానాలు తొలగించడమే కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి దృష్టిలో పెట్టాల్సిన అవసరం అనేది ఉంది.