బ్యాడ్ లక్.. మరో ఛాన్స్ ఇచ్చినా వినియోగించుకోలేని విపక్షాలు!

SEC allows 11 candidates to file papers

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై పార్టీలు దృష్టిపెట్టాయి. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ ఇప్పటిది కాదు. గేతేడాదే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఈ మధ్యకాలంలో నామినేషన్ వేసిన కొంతమంది చనిపోయారు. అప్పుడు తమను బలవంతంగా ఉపసంహరింపజేశారంటూ మరికొంతమంది SECకి ఫిర్యాదు చేశారు. దీంతో చనిపోయిన వాళ్ల స్థానంలో అదే పార్టీ అభ్యర్థి మళ్లీ నామినేషన్ వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. బలవంతపు ఉపసంహరణలపై విచారణ జరిపి కొన్నిచోట్ల మళ్లీ నామినేషన్స్ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. విపక్ష పార్టీల పార్టీలు పెద్దఎత్తున ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

మళ్లీ నామినేషన్లు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వార్డుల్లో అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. తిరుపతి కార్పొరేషన్ లో 6, పుంగనూరు మున్సిపాలిటీలో 3, రాయచోటి మున్సిపాలిటీలో 2 చోట్ల మళ్లీ నామినేషన్లను ఓపెన్ చేసింది. మళ్లీ అవకాశం లభించడంతో విపక్షాలు భారీగా నామినేషన్లు వేస్తాయని అందరూ భావించారు. ఆయా పార్టీల నేతల మాటలను బట్టి నిజంగానే అక్రమాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని నమ్మారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

ఎన్నికల సంఘం 11 వార్డుల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించినా.. కేవలం 3 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. మిగిలినచోట్ల నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ అక్రమాలపై నోరెత్తినవాళ్లంతా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా అధికారపార్టీ బెదిరింపుల వల్లే నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మరికొన్నిచోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఏదైతేనేం.. ఎన్నికల సంఘం మరో ఛాన్స్ ఇచ్చినా పార్టీలు, నాయకులు వినియోగించుకోలేకపోయారు. ఈ విషయంలో అధికార వైసీపీ మాత్రం తన పట్టు నిలుపుకుందనే చెప్పొచ్చు.

 


                    Advertise with us !!!