బంగారం, వెండి దిగొస్తున్నాయ్... కొనిపెట్టుకోండి..!

Gold price falls again Silver rate down as well

కరోనా లాక్ డౌన్ కాలంలో బంగారం ధర ఆకాశ్నంటింది. 52వేలకుపైగా ధర పలికి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. కరోనా సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులందరూ పెట్టుబడికి బంగారాన్ని సురక్షిత మార్గంగా భావించడంతోనే బంగారం ధరలకు రెక్కలొచ్చాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.  ఇప్పట్లో బంగారం ధర తగ్గకపోవచ్చని అంచనా వేశారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పెట్టుబడికి మళ్లీ మార్గాలు తెరుచుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంతోపాటు ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టారు. దీంతో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది.

హైదరాబాద్ లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1040 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.45,930కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 తగ్గి రూ.42,100కు చేరుకుంది. సరిగ్గా నెల రోజుల ముందు.. అంటే ఫిబ్రవరి 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260లుగా ఉండేది. అంటే ఇప్పుడు రూ.3,330లు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.3050లు తగ్గింది. జనవరి నెలలో గరిష్టంగా బంగారం ధర రూ.52,300లు పలికింది. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దిగొస్తోంది.

పసిడి మాత్రమే కాదు వెండి కూడా భారీగా తగ్గుతోంది. సరిగ్గా పది రోజులక్రితం.. అంటే ఫిబ్రవరి 23న కిలో వెండి రూ.75,700లు ఉండేది. కానీ ఇప్పుడు కిలో వెండి రూ.72,000లకు పడిపోయింది. అంటే పది రోజుల్లోనే రూ.3700లు తగ్గింది. ఇది మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 1న వెండి గరిష్టంగా రూ79,200లు పలికింది. అంటే నెలరోజుల్లో సుమారు రూ.7000లకు పైగా తగ్గింది. ఇప్పటికిప్పుడు ఈ ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనేది నిపుణులు చెప్తున్న మాట.

బంగారం, వెండి భారతీయులకు సెంటిమెంట్. కూడబెట్టుకున్న ధనంతో ఆభరణాలు కొనిపెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా.. అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ధరలు తగ్గుతుండడంతో మళ్లీ కొనుగోళ్లకు ఉత్సాహం చూపిస్తున్నారు. వాస్తవానికి బంగారం కొనడానికి ఇది కరెక్ట్ సీజన్. మరింకెందుకు ఆలస్యం. వెంటనే కొనిపెట్టుకోండి.

 


                    Advertise with us !!!