పీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ నాయకులు

The importance of being Prashant Kishor in West Bengal Punjab and Tamilnadu

సాధారణంగా అందరూ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. వారి చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఏవో పనులు చేయించుకునేందుకు, వారి ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ రాజకీయ నాయకులకు కూడా ఎన్నో పనులుంటాయి. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎన్నో చేయాల్సి ఉంటుంది మరి. కానీ ఇవన్నీ వాళ్లు చేసుకోలేరు కాబట్టి చేసి పెట్టేందుకు ఓ వ్యక్తి కావాలి. అతనే ప్రశాంత్ కిశోర్. అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ప్రశాంత్ కిశోర్ తమ పక్కన ఉండాల్సిందే అనేంతగా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు సేవలందిస్తున్నారు. చాలాకాలంగా ఆయన టీఎంసీ గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈసారి కూడా గెలుపు తృణమూల్ దేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎన్ని వ్యూహాలు పన్నినా అక్కడ బీజేపీకి రెండంకెలు దాటవని స్పష్టం చేశారు. మమత బెనర్జీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఒకవేళ అలా జరగకపోతే తాను శాశ్వతంగా సేవలందించడం మానేస్తానని సవాల్ విసిరారు.

మరోవైపు తమిళనాడులో కూడా ప్రశాంత్ కిశోర్ సేవలందిస్తున్నారు. డీఎంకే పార్టీకి ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి సర్వేలన్నీ డీఎంకేకి అనుకూలంగా చెప్తున్నాయి. ఈసారి డీఎంకేదే తిరుగులేని మెజారిటీ అని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రశాంత్ కిశోర్ డిమాండ్ మరింత పెరగడం ఖాయం.

ఇంకోవైపు.. పంజాబ్ లో మళ్లీ చక్రం తిప్పేందుకు ప్రశాంత్ కిశోర్ సిద్ధమైపోయారు. గత ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రశాంత్ కిశోర్ దే. వచ్చే ఏడాదిలో పంజాబ్ లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం అమరీందర్ సింగ్ మళ్లీ ప్రశాంత్ కిశోర్ ను పక్కన చేర్చుకున్నారు. గతంలో పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ను ఈసారి ఏకంగా అధికారంలో భాగం చేశారు. ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ ర్యాంక్ కట్టబెట్టారు. అయితే జీతం మాత్రం ఒక్కరూపాయేనట. జీతంతో పనేముంది. ప్రశాంత్ కిశోర్ పక్కనుంటే మళ్లీ అధికారం తనదేననే ధీమా అమరీందర్ కు ఉంది. అందుకే ఆయన్ను ఏడాది ముందుగానే తనతో చేర్చుకున్నారు.

దీంతో.. ప్రశాంత్ కిశోర్ పేరు మరోసారి మార్మోగిపోతోంది. ఆయన తమతో ఉంటే చాలు.. తమ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ నేతలు భావిస్తున్నారు. అందుకే నేతలంతా ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ చుట్టూ తిరుగుతున్నారు.

 


                    Advertise with us !!!