దేశంలో 43 శాతం ఉంటే... తెలంగాణలో 35 శాతం

T Congress Leader Bhatti Vikramarka Press Meet

దేశంలో 43 శాతం మేర నిరుద్యోగం ఉంటే, తెలంగాణలో 35 శాతం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ సర్కార్‌, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేనని, ప్రైవేటుపరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్రంలో ఈ పరిస్థితి నెలకొంటే, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తీరు మరోలా ఉందని భట్టి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని పీఆర్‌సీ కమిషన్‌ నివేదిక సమర్పించిందని వెల్లడించారు. అయితే ఉద్యోగాల కల్పన విషయంలో మంత్రి కేటీఆర్‌ తప్పుడు లెక్కలు చెబుతూ యువతను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.