
టీఆర్ఎస్ సర్కార్ ఏడేళ్ల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయామని చురకలంటించారు. నాయకత్వం తీరుతో టీఆర్ఎస్ క్యాడర్ గందరగోళంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడగాలో టీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావడం లేదని విమర్శించారు.
ఉద్యోగాల లెక్కలపై మంత్రి కేటీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల విషయంలో కేంద్రాన్ని విమర్శించే అర్హత టీఆర్ఎస్కు లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావటంపై స్పందిస్తూ.. ఆయన సీఎం కావడం అసాధ్యం అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్నావు దంపతలు హత్య కేసులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.