
మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. తనకు ఎంతో అండగా నిలిచిన రిపబ్లికన్ పార్టీని విడిపోయే ఉద్దేశం లేదని, కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదని ఆయన వెల్లడించారు. వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇన్నిరోజులకు ట్రంప్ తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న చలాకీతనం ఇప్పుడు కూడా కనిపించింది. తన మాటలతో అక్కడున్న వారిని నవ్విస్తూ తన మదిలోని మాటలను అంది మందు పరిచారు.
ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జరిగిన 2021 కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ సదస్సుకు హాజరైన ట్రంప్ అక్కడున్న వారినుద్దేశించి ప్రసంగం చేశారు. నాలుగేండ్ల క్రితం మనం కలిసి ప్రారంభించిన సాటిలేని ప్రయాణం, దాని ముగింపు చాలా దూరంలో ఉన్నదని ఈ రోజు తెలియజేయడానికే వచ్చాను. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. మన ఉద్యమం, మన పార్టీ, మన దేశం భవిష్యత్ గురించి మాట్లాడటానికే ఇక్కడ సమావేశమయ్యాం అని ట్రంప్ చెప్పారు. సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి మీరు నన్ను మిస్ అవుతున్నారా? అని ప్రశ్నించారు. సమావేశానికి వచ్చిన చాలా మంది ముక్కుకు మాస్క్ లేకుండా వచ్చారేంటి? అంటూ నవ్వులు కురిపించారు. తనకు అండగా నిలిచిన రిపబ్లికన్ పార్టీని విడిచిపెట్టేది లేదన్నారు. కొత్త పార్టీ కూడా పెట్టనని ట్రంప్ సృష్టం చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో నిజానికి తనదే విజయమని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. డెమోక్రాట్లు ఎన్నికల్లో ఓడిపోయారు. న్యాయాన్ని నిలువునా పాతిపెట్టారు అంటూ ఆక్రోషం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను టార్గెట్ చేసుకున్న ట్రంప్.. ఆధునిక చరిత్రలో ఏ ప్రెసిడెంట్ పదవీకాలంలోనూ మొదటి నెల ఇంత ఘోరంగా లేదని చెప్పారు. బైడెన్ పరిపానలను ఉద్యోగ వ్యతిరేక, కుటుంబ వ్యతిరేక, సరిహద్దు వ్యతిరేక, శక్తి వ్యతిరేక, మహిళా వ్యతిరేక, సైన్స్ వ్యతిరేకమని వారే నిరూపించారని దుయ్యబట్టారు. ఒక్క నెలలోనే అమెరికా ఫస్ట్ నుంచి అమెరికా లాస్ట్ కి చేరుకున్నామన్నారు.