కొవిడ్ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి

vice-president-venkaiahnaidu-takes-first-dose-of-covid-19-vaccine-in-chennai

దేశంలో రెండోదశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్ల పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో కొవిడ్‌ టీకా తొలి డోసును తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకా తీసుకున్నారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత తాను రెండో డోసును తీసుకుంటానని ఆయన ట్వీటర్‌లో తెలిపారు. టీకా తీసుకొనేందుకు అర్హులైన వారందరూ తమంతట తామే ముందుకురావాలన్నారు. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. వివిధ దేశాలకు మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతుండటం భారతీయుడిగా గర్విస్తున్నాన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్‌ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని తెలిపారు.