టీటీడీ కీలక నిర్ణయం ...ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు

TTD-approves-annual-budget

ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైబీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో చైర్మన్‌ అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. 2021-22 సంవత్సరానికి గానూ రూ.2,937 కోట్లతో కూడిన టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ధర్మకర్తల మండలి ఆమోదించింది. బడ్జెట్‌ ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. 80 అంశాలతో రూపొందించిన అజెండాతో పాటు కొన్ని కీలక అంశాలను టేబుల్‌ అజెండాగా సమావేశం ముందుపెట్టారు. ఈ మేరకు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.

రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇకపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే దేశంలోని అన్ని కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని తీర్మానించామన్నారు. టీటీడీ వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞానపీఠంగా పేరు మార్చాలని మండలి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బర్డ్‌ ఆస్పత్రి పాతభవనంలో చిన్న పిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే తిరుమలలో విద్యుత్‌ వాడకంపై క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అతిథి గృహాల్లో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి మెట్ల మార్గంలోనూ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.