దాడి చేసిన వారిపై కాకుండా... గాయపడిన వారిపై కేసులా?

Chandrababu Writes Letter to DGP Gautam Sawang

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. బిక్కవోలు మండలం ఇల్లపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైకాపా మద్దతుదారు, టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైకాపా నేతలు అతనిపై, అతని కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కాకుండా గాయపడిన వారిపై కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు. కేసులు పెడితే ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చూడాలని డీజీపీని కోరారు.