
నాగార్జునసాగర్ బీజేపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టం చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ కాబట్టే పార్టీలో టికెట్ కోసం ఎక్కువ పోటీ నెలకొందన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నాగార్జుసాగర్ బీజేపీ నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. ఉప ఎన్నిక, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. సాగర్ నాయకులతో సమీక్ష అనంతరం గెలుపై మరింత నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శక్తిమంతమైన పార్టీగా బీజేపీ ఎదుగుతోందని అన్నారు. సాగర్ మా పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కలిసి పనిచేసుకోవాలని సాగర్ నేతలకు సూచించినట్లు తెలిపారు.