ఇంటికి వెళ్లే జవాన్ల విషయంలో.. కేంద్రం కీలక నిర్ణయం

CRPF jawans going on leave get MI 17 ferry facility in Kashmir to avoid Pulwama like attack

జమ్మూ కశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. ఎంఐ-17 హెలికాప్టర్‌ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాద దాడులతోపాటు ఐఈడీ పేలుళ్ల నుంచి జవాన్లకు రక్షణ కల్పించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. జవాన్లను రోడ్డు మార్గంలో వాహనశ్రేణి ద్వారా చేరవేయడం వల్ల మ్యాగ్నెటిక్‌ ఐఈడీ, ఆర్‌సీఈఈడీల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తెలియజేశారు. వీటి నుంచి రక్షణ కోసం హెలికాప్టర్‌ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

నిజానికి ఈ అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆమోదించింది. తాజా ఆదేశాల ప్రకారం జవాన్లు, అధికారుల ప్రయాణం కోసం వారంలో మూడుసార్లు బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టరు అందుబాటులో ఉంటుంది అని సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ హెలికాప్టర్‌.. జవాన్లను ఎక్కడి వరకు తీసుకెళ్తుందనే విషయంపై ఇంకా సృష్టత రాలేదని ఆయన తెలిపారు. జవాన్లు ఉండే స్థానం నుంచి జమ్ము లేదా శ్రీనగర్‌ విమానాశ్రయం వరకు చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 2019 ఫిబ్రవరి 14న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణి పాక్‌ ఉగ్రసంస్థ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.