ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనం

Janasena Chief Pawan Kalyan Press Meet on Panchayat Election Results

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 65 శాతం పంచాయతీల్లో జనసేన మద్దతు దారులు ద్వితీయస్థానంలో నిలవడం మార్పునకు సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 1209 సర్పంచ్‌లు, 1776 ఉప సర్పంచ్‌లు, 4,456 మంది వార్డు సభ్యులుగా జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు. మొత్తం మీద 27 శాతం ఓటింగ్‌ను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పొందారని తెలిపారు. జనసేన మద్దతు దారులు గెలుపొందిన చోట కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్టు పవన్‌ తెలిపారు.

తిత్లీ తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో పర్యటించి పంచాయతీల పరిస్థితులను స్వయంగా వీక్షించామన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలస వెళ్లిపోవడం, విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయని చెబుతున్నారే తప్ప ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్టు, సత్ఫలితాలు వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. పల్లెలపై పెత్తనం ఒకటి రెండు వర్గాల గుప్పెట్లో ఉండటం, కొద్ది పాటి కుటుంబాల ఆధిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే కారణమని ఆరోపించారు.

 


                    Advertise with us !!!