కాణిపాకం వినాయకునికి ప్రవాస భారతీయుడు భారీ విరాళం

nri-gives-donation-for-kanipakam-temple

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయుడు రూ.7 కోట్ల విరాళం ఇచ్చారు. ఆలయ ఈవో ఎ.వెంకటేశ్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్రవాస భారతీయుడు చెప్పారని, ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.7 కోట్లు ఇచ్చారని ఈవో వెల్లడించారు. దాత, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. విరాళం అందజేసిన ప్రవాస భారతీయుడు (ఎన్‌ఆర్‌ఐ) తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు.