ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

assembly-election-dates-announcement-live-updates-ec-to-announce-dates-for-assembly-polls-in-assam-kerala-tamil-nadu-west-bengal-puducherry

నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం ఈ తేదీలను ప్రకటించారు. మార్చి నెల 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. కేరళలో 140 స్థానాలు, అసోంలో 126 స్థానాలు, తమిళనాడులో 234 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 294 స్థానాలు, పుదుచ్చేరి 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 వ తేదీన రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఫలితాలు విడుదల చేస్తామని అరోరా ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు కలిపి 18,68 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 

ఐదు రాష్ట్రాల్లో ఏఏ దశల్లో ఎన్నికలు జరుగుతాయంటే...

తమిళనాడు: ఈ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగుతాయి. ఏప్రిల్ 6న ఓటింగ్.

అసోం : ఈ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరపాలని ఈసీ డిసైడ్ అయ్యింది. మార్చి 27 న తొలిదశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ : ఈ రాష్ట్రంలో 8 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 27 న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ, ఏప్రిల్ 10న నాలుగో దశ, ఏప్రిల్ 17న ఐదో దశ, ఏప్రిల్ 22న ఆరో దశ, ఏప్రిల్ 26న ఏడో దశ, ఏప్రిల్ 29న ఎనిమిదో దశ పోలింగ్ జరుగుతాయని ఈసీ ప్రకటించింది.

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 6న పోలింగ్.

కేరళ : ఈ రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్. ఏప్రిల్ 6న పోలింగ్ ఉంటుంది. 

కోవిడ్ నియమాలను కచ్చితంగా ఫాలో అవుతాం : ఈసీ

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పూర్తి కోవిడ్ నియమాలను అనుసరించే ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే రోడ్‌షోకు కూడా అనుమతులు ఉంటాయని వివరించారు. పరీక్షలు, పండుగలు, ఇతరత్రా వాటిని చూసే ఈ తేదీలను ఖరారు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ కచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను వేస్తామని తెలిపారు. 80 ఏళ్లకు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం ఉంటుందని, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు నలుగురే పాల్గొనాలని ఈసీ సూచించింది. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ బూత్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మకమైన పోలింగ్ బూత్‌లను తాము గుర్తించామని, అక్కడ సీఆర్‌పీఎఫ్ బలగాల మోహరింపు ఉంటుందని ఆయన తెలిపారు.

 


                    Advertise with us !!!