
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు పేరుతో 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్, వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంట్ కమిటీలో ఎంపీ అవినాష్ రెడ్డి సభ్యుడిగా ఉండి కూడా ఎందుకు అడ్డుకోలేదు? కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ ఆమ్మేస్తున్నారని అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. ఏపీలో డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యం లేదు. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే కుటుంబాలు ఉండవు. 21 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఏమీ చేయలేదు. శాంతియుతమైన కుప్పంలో కిరాయికి మనుషులను తీసుకొచ్చి అరాచకాలు సృష్టించారు. ప్రజలను, అభ్యర్థులను బెదిరించకుండా ఓట్లు అడగగలరా? పింఛన్ డబ్బులు రూ.250 పెంచి మోసం చేశారు. మునిగిపోయే భూములకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఏం చూసి ప్రజలు వైకాపాకు ఓటు వేయాలని అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.