రివ్యూ : 'చెక్' బౌన్స్ అయ్యింది

Nithin s Check Movie Review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్‌
నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, సాయిచంద్‌, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ సిమ్రాన్ చౌదరి. హర్ష వర్ధన్, చైతన్య కృష్ణ, కార్తీక్ రత్నం, తదితరులు
సంగీతం : కల్యాణీ మాలిక్‌, సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటర్‌ : అనల్ అనిరుద్దన్
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్‌, దర్శకత్వం : చంద్రశేఖర్‌ యేలేటి
విడుదల తేది : 26.02.2021

గతేడాది ఇదే ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత ఈ రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సరికొత్త కంటెంట్ తో చంద్రశేఖర్ ఏలిటి ‘ఐతే’.. ‘అనుకోకుండా ఓరోజు’.. ‘ఒక్కడున్నాడు’.. ‘ప్రయాణం’ 'సాహసం'  వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో వెర్సటైల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. వీటిలో ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’.. ఇలాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే చంద్రశేఖర్ ఏలేటి‌కి కమర్షియల్ సక్సెస్ లేదు. కథలో కంటెంట్ ఉన్నా.. కమర్షియల్ సక్సెస్‌తో గుర్తింపు సాధించలేకపోయారు చంద్రశేఖర్ ఏలేటి. లాంగ్ గ్యాప్ తరువాత  హీరో నితిన్‌తో బాక్సాఫీస్‌కి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. వైవిధ్యమైన ఇతివృత్తంతో  ఎన్నో కమర్షియల్ చిత్రాలను అందించిన భవ్య క్రియేషన్స్ పతాకం పై వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్‌ మరో హిట్‌ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: 

ఆదిత్య (నితిన్) తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని దొంగతనం కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేసేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్‌ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు.  ఇది ఇలా ఉండగా నగరంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో 40 మంది చనిపోతారు. ఆ కేసులో చేయని నేరానికి ఆదిత్య కు ఉరిశిక్ష పడుతుంది. జైల్లో  శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్‌ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్‌ గేమ్‌ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్‌ లాయర్‌ మానస(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీన నరసింహారెడ్డి(సంపత్‌ రాజ్)‌ ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్‌ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్‌ గేమ్‌ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? జైలు నుంచి, శిక్షనుండి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

హీరో నితిన్ నటుడిగా నిలదొక్కుకునేందుకు  విలక్షణ మైన పాత్రను ఎంచుకున్నాడు. ఇటీవల అతను ఇచ్చిన ఇంటర్వ్యూ లో "జయం తరువాత ఎక్కువ టేక్‌లు తీసుకున్న సినిమా ఇదే" అని ముందే చెప్పాడు నితిన్. ఆ టేక్‌లు ఈ పర్ఫెక్షన్ కోసమేనా అనేట్టుగా చేశాడు నితిన్.  తనలోని ఓ కొత్త నటుడ్ని చూపించాడు. సినిమా మొత్తం జైలులోనే ఉండటంతో నితిన్ ఒకేరకం క్యాస్ట్యూమ్స్‌తో కనిపిస్తాడు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. ఓ పక్క తనలో ఆత్మ స్థైర్యం నింపుకుని గ్రాండ్ మాస్టర్ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. మరో పక్క ప్రియా వారియర్‌తో లవ్ ట్రాక్‌లో లవర్ బాయ్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. తొలిసారిగా గ్లామర్ హంగుల్ని పక్కన పెట్టి క్యారెక్టర్ స్కోప్‌ ఉన్నలాయర్ పాత్రలో నటించింది. హీరోతో రొమాన్స్.. సాంగ్స్ లాంటి వాటికి ఈ సినిమాలో అవకాశం లేకపోవడంతో కేవలం లాయర్ అనే క్యారెక్టర్‌కి పరిమితం అయ్యింది రకుల్. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. స్క్రీన్ మీద కనిపించినంతసేపూ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ‘నిన్న చూడలేక’ సాంగ్‌లో వింక్ బ్యూటీ కనుల విందు చేసింది. కథలో ఆమెకి కీలకమైన నేపథ్యం ఉండటంతో వింక్ బ్యూటీకి మంచి రోల్ పడిందనే చెప్పాలి. ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్‌ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకే హైలెట్‌. ఈ సినిమాలో నితిన్ గురువుగా మరోసారి మెస్మరైజ్ చేశాడు. కథ పుంజుకునేది ఆయన పాత్రతోనే. జైలు అధికారులుగా మురళీశర్మ, సంపత్‌ రాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఈ తరహా పాత్రల్లో చాలాసార్లు కనిపించడంతో కొత్తగా అనిపించవు. పైగా నితిన్ ‘భీష్మ’ చిత్రంలో సంపత్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించడంతో పెద్దగా తేడా లేనట్లు అనిపించింది. 

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి కథలు వాస్తవ జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు, అవి అందించే భావోద్వేగాలు హ్యూమన్ ఎమోషన్స్ లాంటి అంశాలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్‌ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్‌ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్‌ గేమ్‌ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్‌ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి బోర్‌ కొట్టిస్తాయి. కళాదర్శకుడు వివేక్ అన్నమలై వర్క్ ఓ కొత్త లుక్ తీసుకువచ్చింది. జైలు సన్నివేశాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఎమ్. నరేష్ రెడ్డి మాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. చాలాచోట్ల వేదాంతం వినిపించినట్టుగానే అనిపిస్తాయి. కళ్యాణ్ మాలిక్ రీ రికార్డింగ్‌ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. కథకు తగ్గట్టుగా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రాహుల్ శ్రీ వాత్సవ్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు జైలు సన్నివేషాలు బాగా చూపించారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

విశ్లేషణ:

చెక్ అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్‌ కొట్టించే అంశం. ఇక నేషనల్‌ చెస్‌ చాంపియన్‌ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా వచ్చి అలా పోతున్నట్లు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. అయితే  హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్‌ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. మొత్తంగా చెక్ మాస్టర్ పీస్ మూవీ కాదు కానీ.. ఓ మంచి ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. చంద్రశేఖర్ యేలేటి మార్క్ కనిపించినా బాక్సాఫీస్‌కి చెక్ పెట్టే రేంజ్‌లో అయితే ఈ ‘చెక్’ లేదు.

 


                    Advertise with us !!!