
న్యాయవాది వామన్రావు దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటన అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ తమిళి సైని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యలో పోలీసుల పాత్ర ఉందని జనం నమ్ముతున్నారన్నారు. హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం, మంథనిలో టీఆర్ఎస్ అక్రమాలకు అడ్డుగా నిలవడంతోనే వామన్రావు దంపతులను పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిసరాల్లో నుంచి రూ.4వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారని, దీనిపైనా వామన్రావు పోరాటం చేసేందుకు సిద్ధమవుతుండగా మట్టుబెట్టారని వివరించారు. పుట్ట లింగయ్య చారిటబుల్ ట్రస్టుకు అక్రమ మార్గంలో సేకరిస్తున్న నిధులను వామన్రావు బయటపెట్టడంతోనే అడ్డు తొలగించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.