
వాషింగ్టన్ః మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఆహార కేంద్రాలకు, ఆరోగ్య కేంద్రాలకు, హోటళ్లకు 2.5 కోట్లకు పైగా మాస్కులు సరఫరా చేయాలని జో బైడెన్, కమలా హారిస్ల ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కొత్త వైరెంట్ సోకడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో ఈ మాస్కుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
''వివిధ వయసులవారికి వివిధ పరిణామాల్లో మాస్కులు అందుబాటులో ఉంటున్నప్పటికీ, అమెరికాలో అనేక ప్రాంతాలలో ఇప్పటికీ లక్షలాది మంది పేదలు వీటిని కొనగల స్థితిలో లేరు. అమెరికన్లు సురక్షితంగా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మాస్కుల పంపిణీకి కీలక నిర్ణయం తీసుకొంది'' అని అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో కరోనా వైరస్ వ్యవహారాల సమన్వయకర్తగా విధులు నిర్వర్తిస్తున్న జెఫ్ జెయింట్స్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
మార్చిలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 1,300కు పైగా ఆరోగ్య కేంద్రాలలో, 60,000కి పైగా ఆహార కేంద్రాలలో మాస్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల కోటి 20 లక్షల నుంచి కోటి 50 లక్షల వరకు అమెరికన్లు మాస్కులను పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు.
''ఎంతో నాణ్యత, మన్నిక కలిగిన మాస్కులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిని తేలికగా శుభ్రం చేయవచ్చు. సి.డి.సి ప్రమాణాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేశారు'' అని ఆయన తెలిపారు. ఈ మాస్కులన్నిటినీ అమెరికాలోనే తయారు చేశారని, పేదలకు వీటిని సరఫరా చేయడం వల్ల ఆరోగ్య కార్యకర్తలకు మాస్కుల కొరత ఏర్పడడమంటూ జరగదని జెయింట్స్ తెలిపారు.
ఈ మాస్కుల తయారీకి సుమారు 8.6 కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంటూ ఆయన, మాస్కులు కొనలేనివారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఈ రక్షణ సాధనం వల్ల వైరస్ను కొంత వరకూ నిరోధించవచ్చని, అమెరికన్లు అందరి వద్దా మాస్కులు తప్పనిసరిగా ఉండాలని, వారు వాటిని తప్పనిసరిగా ధరించాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బైడెన్, కమలా హారిస్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఇళ్లలోంచి బయటికి వచ్చిన మరుక్షణం నుంచి మాస్కులు ధరించవలసిందేనని బైడెన్ ప్రభుత్వం మొదటి రోజునే స్పష్టంగా ఆదేశించింది. వాస్తవానికి, ట్రంప్ పదవీ కాలం చివరి రోజుల్లో కొందరు అధికారులు, నిపుణులు ఆయనకు ఈ మేరకు సలహా ఇచ్చారు కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ఇష్టపడని ట్రంప్ ఈ సలహాను తిరస్కరించారు.