సోషల్ మీడియా... ఇకపై కఠినతరం... కొత్త నిబంధనలు ప్రకటించిన సర్కార్

govt-announces-guidelines-for-intermediaries-and-digital-media-ethics-code-2021

రోజురోజుకీ ఏకుమేకై కూర్చుంటున్న సోషల్ మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇకపై కఠిన వైఖరి అవలంబించనుంది. ఇకపై ఇష్టం వచ్చిన రీతిలో సోషల్ మీడియాను వాడుకుంటామంటే కుదరదు. ఆచితూచి వ్యవహరించాలి. రోజురోజుకీ పెరిగిపోతున్న తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలకు కొత్త నిబంధనలు, నియమావళిని రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను, నియమాలను తప్పకుండా పాటించాల్సిందేనని, ఆ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. అభ్యంతరకరమైన మార్ఫింగ్ పోస్టులను తొలగించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే పాటించాలని, లేదంటే ఆ సంస్థకు నోటీసులు ఇస్తామని ప్రకటించారు. ఓటీటీ, సోషల్ మీడియాకు కళ్లెం వేయడానికి మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అమలు చేయనున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

ఓటీటీ, డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలని తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ కచ్చితమని తాము చెప్పడం లేదని, అయితే వాటి గురించిన సమాచారాన్ని మాత్రమే తాము కోరుతున్నామని వివరించారు. అంతేకాకుండా మొత్తం సోషల్ మీడియా విషయంలో వచ్చే ఫిర్యాదుల విషయంలో ఓ పరిష్కార వ్యవస్థ ఉండాలని, హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి లేదా ప్రముఖ వ్యక్తి నేతృత్వంలోనే ఓటీటీ నియంత్రణ వ్యవస్థ ఉండాలని సూచించారు. వీటన్నింటితో పాటు కంటెంట్‌కు సంబంధించి కేటగిరీల్లో స్వీయ వర్గీకరణలు కూడా ఉండాలని, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లాకింగ్ ఉండాలని జవదేకర్ సూచించారు. తలిదండ్రులకు తెలియకుండా లాక్‌ను తెరవకుండా చూసుకోవాల్సిందేనని జవదేకర్ పేర్కొన్నారు. 

మూడు నెలల్లో నిబంధనలు : రవిశంకర్ ప్రసాద్

కొన్ని సామాజిక మాధ్యమాలను విషయంలో మరో మూడు నెలల్లోగా నిబంధనలను జారీ చేస్తామని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఆలోపే ఆయా సంస్థలు వారి వారి విధానాల్ని మార్చుకోవాలని తేల్చి చెప్పారు. మిగతా నిబంధనలు మాత్రం ప్రకటించిన రోజు నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. దేశంలోకి కొత్తగా వచ్చే ప్రతి సామాజిక మాధ్యమాన్నీ తాము స్వాగతిస్తామని, అందులో సందేహమే అవసరం లేదని ప్రకటించారు. కానీ... రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తామంటే మాత్రం కుదిరే పనికాదని హెచ్చరించారు. అమెరికా క్యాపిటల్‌పై దాడి జరిగినప్పుడు చాలా కఠినంగా ఉన్నారని, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రచ్చ రచ్చ జరిగితే మాత్రం పట్టించుకోకుండా, ఉదాసీనంగా ఉండిపోయారని మండిపడ్డారు. 

మరికొన్ని విషయాలు...

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో

1. ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేయడం కుదరదు.
2. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా, కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగానే పరిష్కారం చూపాలి.
3. అభ్యంతరకరమైన పోస్ట్ అని గుర్తించిన పోస్ట్‌ను 24 గంటల్లోగా తొలగించాలి. లేదంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి.
4. నోడల్ ఏజెన్సీ 24 గంటలూ చూస్తూనే ఉంటుంది. ఫిర్యాదుల అమలుకు మాత్రం నోడల్ ఏజన్సీదే బాధ్యత.
5. లైంగిక పరమైన వాటి విషయంలో ఫిర్యాదు అందిన రోజే పరిష్కారం చూపాలి.
6. మతపరమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను పరిశీలించడానికి కంపెనీ తప్పనిసరిగా ఓ అధికారిని నియమించుకోవాలి. అయితే ఆ అధికారి భారతీయుడై ఉండాలి.
7. సత్య ప్రచారాన్ని ఏ వ్యక్తి అయితే మొదట ప్రచారం చేస్తారో... ఆ వ్యక్తి వివరాలను మాత్రం కచ్చితంగా వెల్లడించి తీరాలి.