ప్రజలు తిరుగుబాటు చేస్తే... మీరు పారిపోవడం ఖాయం

Chandrababu Public Meeting at Kuppam

తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పేదలకు అండగా ఉంటూ వాళ్ల తరపున పోరాడతానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 25 ఏళ్లు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నానని, నేనేదో భయపడతాననుకుంటే ఖబడ్దార్‍ అని పరోక్షంగా వైకాపా నేతలను హెచ్చరించారు. తప్పుడు పనులు చేస్తూ బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు. పథకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. దోపిడీ రాజకీయాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం ఖాయం అని వైకాపా నేతలను ఉద్దేశించి అన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరి సొంతమూ కాదని, ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు తాను కూడా అలాగే అనుకునే ఉంటే కాంగ్రెస్‍, వైకాపా నేతలకు పథకాలు అందేవా? నేనెప్పుడైనా వివక్ష చూపానా? అని ప్రశ్నించారు. కుప్పం రాష్ట్రానికే ఆదర్శమని, ఇక్కడి ప్రజలు తననెప్పుడూ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఏ మంచి పనిచేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభించానని చెప్పారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.