
సామాజిక మాధ్యమాల్లో కొందరు రాజకీయ నాయకుల పట్ల రకరకాల వార్తలు వ్యాప్తి చేస్తూ పరుష పదజాలంతో అవమాన పరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అభిమానుల అత్యుత్సాహం పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. సొంత పార్టీలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదని ఆయన హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో పరస్పర దుష్ప్రచారాలతో పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. గీత దాటే అభిమానులు, కార్యకర్తలపై పీసీసీ చర్యలు తీసుకోవాలని లేదంటే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
పీసీసీ నాయకత్వం అంతా సమావేశమై అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుకు ఒకాయన ఫోన్ చేసి వాడిన భాష సరైంది కాదని తన దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ వేదికలపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేతలు పార్టీని వీడటానికి కారణం కాంగ్రెస్ లో లోపం కాదని, సమాజంలో లోపమని అన్నారు.