రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన లెఫ్ట్

cpm central committee fires on rahul gandhi

కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, లెఫ్ట్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ మరింత విమర్శలకు దిగుతున్నాయి. ఇన్ని రోజులు రాష్ట్ర నేతల మధ్యే ఉండే విమర్శలు ఇప్పుడు నేరుగా అగ్రనేతలే టార్గెట్‌గా సాగుతున్నాయి. తాజాగా సీపీఎం కేంద్ర కమిటీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రాహుల్ గాంధీ భాష అచ్చు బీజేపీ భాషలా మారిపోయిందని, రాహుల్ మచ్చుకైనా బీజేపీని విమర్శించడం లేదని, బీజేపీ గొంతుగా మారిపోయారని సీపీఎం కేంద్ర కమిటీ తీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడంలోనూ రాహుల్ విఫలం చెందారని విమర్శించింది. బీజేపీ వాయిస్‌గా కాంగ్రెస్ మారిందని తీవ్రంగా ధ్వజమెత్తారు.  కేరళ పర్యటన సందర్భంగా రాహుల్ తమపై విమర్శలకు దిగుతున్నారని, ఇది సరికాదన్నారు. ‘‘రాహుల్ కేరళలో పర్యటించారు. మాపై విమర్శలకు దిగారు. ఆయన గొంతులో బీజేపీ గొంతు ప్రతిధ్వనించింది. కాంగ్రెస్ మమతత్వానికి లొంగిపోయింది. కాంగ్రెస్ చేసిన మాటలే ఇప్పుడు బీజేపీకి అస్త్రాలు. ఆ కారణంగానే వివిధ రాష్ట్రాల్లోకి బీజేపీ పాతుకుపోయింది.’’ అని సీపీఎం మండిపడింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేరళలో పర్యటించారని, కనీసంలో కనీసం బీజేపీని విమర్శించలేదని, ఇదంతా అధిష్ఠానం సూచనలతోనే నడిపిస్తున్నారని సీపీఎం మండిపడింది. 

ఒకప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాహుల్ పదే పదే విమర్శలు చేసేవారని, ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదని విమర్శించింది. ఎందుకో రాహుల్ వ్యవహారం చూస్తుంటే తమకు కాస్త అనుమానాలు కలుగుతున్నాయని చురకలంటించింది. పినరయ్ ప్రభుత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వర్తించడంపై రాహుల్ స్పందించారు. దీనిపై కూడా సీపీఎం స్పందించింది. ఆయన బావమరిది వాద్రాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులున్నాయని, ఈ విషయాన్ని రాహుల్ తన జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుంటుందని చురకలంటించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్మగ్లింగ్, మత్స్యకారుల సమస్యలు, రైతుల సమస్యలపై రాహుల్ తమపై విరుచుకుపడుతున్నారని, కాంగ్రెస్ పాలించిన కాలంలోనూ వారి బతుకులు అంతే ఉన్నాయని మండిపడ్డారు. రాహుల్ ప్రస్తుతం ఆర్థిక మోసం కేసులో బెయిల్ పై తిరుగుతున్నారని, ఆయన ఈ విషయం మరిచిపోయారని ఎద్దేవా చేసింది. బీజేపీకి, రాహుల్ కు మధ్య ఓ అవగాహన కుదిరిందని, తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోడానికే ట్రాక్టర్ ర్యాలీ అని సీపీఎం మండిపడింది. 

జాలర్ల జీవితాలు తెలుసు... అందుకు మాట్లాడారు : కాంగ్రెస్

కేరళ పర్యటన సందర్భంగా రాహుల్ జాలర్ల గురించి మాట్లాడారు. అయితే దీనిపై అధికార సీపీఎం తీవ్రంగా స్పందించింది. రాహుల్ పై మండిపడింది. రాహుల్‌కు సమస్యపై అవగాహన లేదని మండిపడింది. కేంద్రంలో ప్రత్యేకమైన మత్స్య శాఖ ఉండాలని, అప్పుడే మత్స్యకారుల జీవితాలకు రక్షణ లభిస్తుందన్నారు. మత్స్యకారులు కష్టంతో ఇతరులు లాభం పొందుతున్నారని పరోక్షంగా లెఫ్ట్ సర్కార్‌పై మండిపడ్డారు. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా స్పందించింది. మత్స్యశాఖ వ్యవసాయ శాఖ కిందికే వస్తుందని, అయినా ఎవరూ పట్టించుకోరని రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ‘‘వారి సమస్యలను ప్రస్తావించినందుకు రాహుల్‌‌ను అభినందిస్తున్నా. మత్స్యకారులకు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాల్సిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ శాఖ ఉంది. కేంద్రం మాత్రం శ్రద్ధ వహించడం లేదు.’’ అని ఖర్గే మండిపడ్డారు.

 


                    Advertise with us !!!