వారసత్వాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం : మోదీ

Govt will monetise or modernise public sector enterprises says Modi

కేవలం వారసత్వా్న్ని కొనసాగించడం కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని వివరించారు. అయితే ప్రైవేట్ రంగం వల్ల సమర్థత పెరిగి, నూతన ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చిన ధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. కొన్ని సంస్థలు వాటి సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేయడం లేదని, వాటిని అబ్జర్వ్ చేయడానికి ధనాన్ని సేకరిస్తామని ప్రకటించారు. నాలుగు రంగాలను మినహాయించి అన్ని రంగాలనూ ప్రైవేట్ చేసేస్తామని మోదీ పునరుద్ఘాటించారు. 

వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం ఎంత మాత్రమూ కాదని, వ్యాపార రంగానికి తమ వంతుగా కాస్త సహాయం మాత్రమే ప్రభుత్వం అందిస్తుందన్నారు. నేరుగా ప్రభుత్వమే జోక్యం చేసుకుంటూ వ్యాపారం చేయాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని రంగాల నుంచి ప్రభుత్వం వైదొలుగుతోందని, ఆ లోటును ప్రైవేట్ రంగం భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం గనక వ్యాపారం చేస్తే అది నష్టాల వైపు దారితీస్తుందని, నియమ నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. వ్యాపారాత్మకంగా లాభం వైపు నడిచే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండదన్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిన నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడాలున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ పద్ధతిలో దొరికిన సొమ్మును సద్వినియోగమే చేస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. 

మండిపడ్డ రాహుల్ గాంధీ

మరోవైపు ప్రైవెటీకరణ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మండిపడుతున్నారు. ప్రధాని మోదీ దేశాన్నే అమ్మేస్తున్నారని ఆరోపించారు. ‘క్రోనీ జీవీహైవో... దేశ్ బేచ్ రహాహై’’ అంటూ మండిపడ్డారు. దేశాన్ని అమ్మేవారే ఆందోళన్ జీవులని మండిపడ్డారు.

 


                    Advertise with us !!!