మోతేర స్టేడియం కాదు... మోదీ స్టేడియం.....

Sardar Patel Cricket Stadium In Motera Renamed Narendra Modi Stadium

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ప్రసిద్ధి చెందిన మోతేరా స్టేడియం పేరు మారిపోయింది. ఇకపై మోతేరా స్టేడియం కాదు... ‘మోదీ స్టేడియం.’ ఇంతకు పూర్వం సర్దార్ వల్లభాభాయ్ పటేల్ స్టేడియం అని పేరు ఉండేది. తాజాగా దీని పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చేశారు. ఈ మేరకు స్టేడియం బాధ్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు. పేరు పటేల్ స్టేడియం అయినా, మోతేరాలో ఉన్న కారణంగా దీనికి మోతేరా స్టేడియం అన్న పేరు వచ్చింది. అయితే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనే దీన్ని నిర్మించాలని భావించారని, అందుకే పటేల్ స్టేడియాన్ని కాస్త మోదీ స్టేడియంగా పేరు పెట్టాలని నిర్ణయించారని కోవింద్ వెల్లడించారు. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో అహ్మదాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మోదీ కలల ప్రాజెక్టు అని, అందుకే ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివరించారు. 

స్టేడియం ప్రత్యేకతలివే....

భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండు టెస్టులు, టీ 20 సిరీస్ ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఈ స్టేడియం. గుజరాత్ సబర్మతి నది ఒడ్డున 1982 లో దీనిని నిర్మించారు. 2015 లోపు దీనిని పునరుద్ధరించి, సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఆనాటి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చి దిద్దాలనీ సంకల్పించింది. అయితే పునరుద్ధరణ కాక మునుపు దీని సీటింగ్ కెపాసిటీ 49 వేలు మాత్రమే. ఇప్పుడు మాత్రం మూడింతలు పెరిగింది. మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యాన్ని కూడా ఈ మోతే స్టేడియం వెనక్కి నెట్టేసింది. ముందుకు దూసుకుపోయింది. ఇందులో నాలుగు డ్రెస్సింగ్ రూములు, ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, మూడు అవుట్ డోర్ ప్రాక్టీస్ ఫీల్డ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒకేసారి 1,10,000 అభిమానులు కూర్చోని హాయిగా వీక్షించవచ్చు. 63 ఎకరాల్లో దీనిని నిర్మించారు. ఒకవేళ వర్షం కురిసినా... నీరు స్టేడియంలోకి వస్తే... 30 నిమిషాల్లోగా ఆ నీటిని బయటికి పంపే ఏర్పాట్లు చేశారంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా... 40 మంది ఆటగాళ్లకు సరిపడా వసతి గృహాలతో కూడిన క్రికెట్ అకాడమీ కూడా ఇందులో ఉంది. అయితే దీని పునరుద్ధరణ కోసం 2015 లో మూసేశారు. 800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. 

మోదీకి రిటైర్డ్ అయ్యే సమయం దగ్గరపడింది : ఛత్తీస్‌గఢ్ సీఎం

మోతేరా స్టేడియానికి మోదీ స్టేడియం అని పేరు పెట్టడంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ సింగ్ బాగేలా స్పందించారు. మోదీకి రిటైర్డ్ సమయం ఆసన్నమైంది కాబట్టే ఇలా పేరు పెట్టుకున్నారని విమర్శించారు. అయితే ఈ మాటలు వ్యంగ్యాస్త్రాలు కావని, బీజేపీ సంప్రదాయమే ఇదన్నారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఉన్న సమయంలో ‘అటల్ చౌక్ అని పేరు పెట్టారని, ఆ తర్వాతే ఆయన పదవి కోల్పోయారని గుర్తు చేశారు. ఇప్పుడు మోతేరా క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ పేరు పెట్టారని త్వరలోనే ఆయన పదవి కోల్పోతున్నారడానికి ఇదే ఉదాహరణ అని భూపేష్ వ్యాఖ్యానించారు.

 


                    Advertise with us !!!