సీఎం మమత నోట ట్రంప్ మాట

pm-modi-biggest-rioter-will-meet-fate-worse-than-donald-trump-says-mamata-banerjee

సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధాని మోదీని విమర్శించే పనిలో భాగంగా ట్రంప్‌ను ఉటంకిస్తూ మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమిటి? ట్రంప్ కంటే ఘోరమైన ఇబ్బందులను మోదీ ఎదుర్కొంటారు.’’ అంటూ మండిపడ్డారు. సీఎం మమత హౌరాలోని షాన్‌గంజ్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అల్లర్లను సృష్టించే వ్యక్తి అని ఆరోపించారు. ‘‘అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమిటి? హింస ద్వారా సాధించేది ఏమీ ఉండదు. ట్రంప్ కంటే ఘోరమైన అవమానాన్ని మోదీ ఎదుర్కొంటారు.’’ అంటూ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇద్దరూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అన్య పార్టీల వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరేమో రాక్షసుడని, మరొకరు రావణుడని వీరిద్దరూ కలిసి దేశాన్ని పాలిస్తున్నారని విరుచుకుపడ్డారు. 

మోదీ, షా చాలా మాట్లాడుతున్నారని, తాము మాత్రం కొంత కాలం తర్వాత స్పందిస్తామన్నారు. బెంగాల్‌లో గెలవడం అంత ఈజీ కాదని, బెంగాల్ భూమిలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తాను ప్రధాని పదవిని కచ్చితంగా గౌరవిస్తానని, నేడు ప్రధాని పదవిలో మోదీ ఉన్నారని, రేపు మరొకరు ఉండొచ్చని, కానీ మోదీ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో తామే గోల్ కీపర్లమని, బీజేపీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలో టెలీప్రాంటర్ వాడుతున్నారని, తాను గుజరాతీలో ఆ టెలిప్రాంటర్ లేకుండానే సంభాషించగలనని ఆమె చురకలంటించారు. బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదని విమర్శిస్తున్నారని, అసలు బీజేపీలో మహిళలు సురక్షితంగా ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలు సురక్షితంగా ఉన్నారా? అని ప్రశ్నలు సంధించారు. 

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు...

మోదీ,షా ద్వయం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మమత మండిపడ్డారు. తనతో సహా 20 లక్షల మంది కార్యకర్తలం ఉన్నామని, ఇక్కడ పాతేస్తే తాము ఢిల్లీలో వృక్షాలుగా వస్తామని ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ‘‘మా అందర్నీ అరెస్ట్ చేయండి. మేమంతా 20 లక్షల మంది ఉన్నాం. ఇక్కడ పాతేస్తే.. ఢిల్లీలో వృక్షాలుగా మొలుస్తాం. గాయపడ్డ పులి చాలా భయంకరమైంది. ఇప్పుడే ఆట మొదలైంది. మీరు బెంగాల్‌లో బీజేపీని ఓడిస్తే.. మిగితా ప్రాంతాల్లో అది కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. అభిషేక్ బెనర్జీ భార్యను బొగ్గు దొంగ అంటూ నిందిస్తున్నారని, ఇలా చేయడం ద్వారా మహిళలను కించపరుస్తున్నారని ఆరోపించారు. 

ఉచిత టీకాలు వేయండి.. కానీ ఎన్నికల కంటే ముందే

ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రజలకు ఉచిత టీకాలు వేయాలని సీఎం మమత సూచిస్తూ చురకలంటించారు. ఎన్నికల సమయంలో లేనిపోని ఇబ్బందులు వస్తాయని, అందుకే ఎన్నికల తంతు కంటే ముందే టీకాలు వేయడం బాగుటుందని సూచించారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. మరికొన్ని రోజుల్లోగా బెంగాల్ ఎన్నికల ముంగిట్లోకి వెళ్తోందని, ప్రజలకు, ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. ఈ విషయంలో తాము చాలా ఆందోళనకు గురి అవుతున్నామని, అందుకే ఎన్నికల కంటే ముందే ప్రజలకు ఉచిత టీకాలు ఇవ్వాలని మమత ఆ లేఖలో పేర్కొన్నారు.