
భారత్లో సంపన్న వర్గాలు అంతకంతకు పెరుగుతున్నారు. వచ్చే ఐదేండ్లకాలంలో దేశంలో అపర కుబేరుల సంఖ్య మరో 63 శాతం పెరిగి 11,198కి చేరుకోనున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. 30 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే వ్యక్తిగత సంపాదన ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ప్రస్తుతం భారత్లో 6,884 మంది అపర కుబేరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న వర్గాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ వచ్చే ఐదేండ్లలో మరింత మంది జతకానున్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్నీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా విడుదల చేసిన వెల్తీ 2021 నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5,21,653 మంది అపర కుబేరులు ఉండగా, 2020-25 మధ్యకాలంలో 27 శాతం వృద్ధితో 6,63,483కి చేరుకోనున్నారు. 2020లో భారత్లో 113 మంది ఉన్న బిలియనీర్లు 2025 నాటికి 43 శాతం వృద్ధితో 162కి చేరనున్నారు. కుబేరుల వృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా సరాసరి వృద్ధి 24 శాతంగా ఉండగా, అదే ఆసియాలో 38 శాతంగా ఉన్నది. ఆసియాలో ఇండోనేషియా(67 శాతం) తొలిస్థానంలో ఉండగా, భారత్ (63 శాతం) ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ముంబైలో 920 మంది అపర కుబేరులు ఉండగా, ఢిల్లీలో 375 మంది, బెంగళూరులలో 238 మంది ఉన్నారు. దేశీయ కుబేరుల్లో అత్యధిక మంది బంగారు ఆభరణాలపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు ఉన్నాయి.