ఈ సంక్షేమాన్ని జగన్ కట్టడి చేస్తారా...?

Analyse data on welfare schemes for better governance, says Jagan

2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత చాలా వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను బలంగానే అమలు చేస్తూ వస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. వాస్తవానికి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో తప్పు లేకపోయినా సరే సంక్షేమ కార్యక్రమాల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు అనే భావన చాలా మందిలో ఉంది.

గతంలో విజయం సాధించిన చాలా మంది ముఖ్యమంత్రులు సంక్షేమ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారు. ఎన్నికల ఏడాదిలో మాత్రమే అమలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గెలిచిన మొదటి ఏడాది నుంచి కూడా అమలు చేయడం పై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కుతగ్గే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతోంది.

కేంద్రం కూడా సహాయం చేసే విషయంలో ఇబ్బందులు పెడుతూనే ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలంగా లేదు. అయినా సరే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు మాత్రం నిధులు ఇస్తూనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి మాత్రం నిధులు ఇచ్చే విషయంలో అనేక ఇబ్బందులు పెడుతుంది. 2014 నుంచి కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దగా నిధులు ఇచ్చిన పరిస్థితి కూడా ఏమీ లేదు. ఇవ్వాల్సిన నిధులు కొన్ని కొన్ని నిధులు మినహా రాష్ట్రంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిధులు ఇచ్చే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాస్త వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో లబ్ధిదారులను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొన్నటివరకు ప్రయత్నం చేసింది. దీని ద్వారా ప్రజల్లో లబ్దిపొందే ప్రయత్నాలను ముఖ్యమంత్రి జగన్ చేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థను మరింతగా ఇబ్బంది పడింది. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులను తగ్గించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించి క్యాబినెట్ లో ఒక కమిటీని కూడా వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవానికి రైతు భరోసా కార్యక్రమాన్ని చాలామంది పెద్దపెద్ద రైతులు కూడా తీసుకుంటున్నారు. దీనివలన అసలైన లబ్ధిదారులకు ఈ కార్యక్రమం అనేది అందడం లేదు. అమ్మ ఒడి విషయంలో కూడా దాదాపుగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే మరికొన్ని కార్యక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పలు కార్యక్రమాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్ వీటి విషయంలో కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.