అభిమానులను కన్నీరు పెట్టిస్తున్న పవన్... ఇది మంచిది కాదన్నా...!

Janasena Cheif Pawan Kalyan New Strategy In AP Politics

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ 2014లో ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అనే మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ కు అవకాశాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి అనే విషయం కూడా అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అవకాశాలను సృష్టించుకొనే విషయంలో ముందు నుంచి కూడా ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవానికి రాజకీయాలు చేసే నేతలు 24 గంటలు కూడా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది.

కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టారు. దీని కారణంగా జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన ఆందోళన ఎక్కువగా ఉంది. వాస్తవంగా మాట్లాడితే జనసేన పార్టీకి కార్యకర్తల బలం కంటే కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల బలం ఎక్కువగా ఉంది. అభిమానులని కార్యకర్తలగా మార్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమవుతున్నారనే ఆవేదన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 2008లో చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల బలం చూసుకుని ప్రజారాజ్యం విజయం సాధిస్తుందని చాలా బలంగా నమ్మారు.

కానీ అనుకోని విధంగా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అతి చిన్న పార్టీగా అప్పట్లో ఆ పార్టీ పరిమితమైంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి దాదాపు అలాగే ఉందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. కనీసం పవన్ కళ్యాణ్ కూడా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు జనసేన పార్టీని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతోందనే భావన చాలామందిలో వ్యక్తమవుతుంది. జనసేన పార్టీ అధినేతగా కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి బాధ్యతలు అప్పగించి ఆయన హైదరాబాదులో సినిమాలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. ఇటీవల గెలిచిన అభ్యర్థుల తో ఆయన ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీ విజయం కోసం సమిష్టిగా కృషి చేసినా సరే ఆయన మాత్రం పార్టీ కోసం ముందుకు రాలేకపోయారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గెలిచిన సర్పంచ్ ల తో సమావేశాలు ఏర్పాటు చేయడంపై జనసేన పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేశామని కానీ పవన్ కళ్యాణ్ ఇలా ముందుకు రాకపోవడంతో తాము కాస్త ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ వాళ్ళ బాధ అర్థం చేసుకుంటారా లేదా అనేది చూడాలి.