మీ కష్టాలు తీర్చేందుకు రాజన్నరాజ్యం తెస్తున్నా...షర్మిల

YS Sharmila To Hold Meeting With Students And Unemployed

తెలంగాణలో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకే రాజన్న రాజ్యం తెస్తున్నట్లు వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి కూతురు షర్మిల పేర్కొన్నారు. తెలంగాణా విద్యార్ధులతో ఆమె నేడు లోటస్‌ పాండ్‌ లో సమావేశమయ్యారు. విద్యార్ధులు తమ సమస్యలను ఆమెకు వినిపించారు. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖర్‌ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దని ఆయన భావించారన్నారు. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని, నేడు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె అన్నారు. వాళ్లంతా ఎప్పటికీ రాజశేఖర్‌ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కుతుందన్నారు.

ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలని, తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అందరి నిరీక్షణ ఫలించాలంటే, ఒక మంచి సమాజం రావాలని అభిలషించారు. భేటి అనంతరం విద్యార్ధులు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి పునాదే యువకులని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువకులను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో రాజన్న రాజ్యంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు షర్మిల కూడా తమకు ప్రాధాన్యత ఇస్తారని తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు.


                    Advertise with us !!!