చద్దన్నం ఇప్పుడు పాపులర్ అవుతోంది...

Chaddannam is now popular

ప్రాచీన భారతీయ ఆహారం మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో, దానిని విస్మరించి పాశ్చాత్య ఫుడ్‌కు అలవాటు పడి మనం ఏమి కోల్పోతున్నామో కరోనా లాంటి రోగాలు మనకు గుర్తు చేశాయి. అదే సమయంలో పాశ్చాత్యులు ఇప్పుడు భారతీయ ప్రాచీన ఆహారవంటకాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని వాడటం మొదలు పెట్టారు. మనం ఇంకా పాస్ట్‌ ఫుడ్‌ తింటూ రోగాలు తెచ్చుకుంటున్నాము.

భారతీయ వంటకాల్లో ప్రధానంగా కనిపించే పోపు, తిరగమోత ఎంతో ముఖ్యమో మనకు ఇప్పుడు తెలుస్తోంది. అలాగే  తరాల తరబడీ మీరు వాడిన బొగ్గు, ఉప్పే భద్రంరా బాబూ అని మళ్లీ కోల్గేట్‌ వాడు చెబితే తప్ప మనకు సమజ్‌ అవలేదు. ఇప్పుడు చద్దన్నం మంచిదిరా నాయనా అని నోవాటెల్‌ వాడు చెబితేనే మనవాళ్లలో చర్చ ప్రారంభమైంది. వాడు ఇంగ్లిషులో ప్రొబయాటిక్‌, ఫర్మెంటెడ్‌ రైస్‌ అని, హెచ్చురేటు పెట్టి దానిని అమ్ముతున్నాడని తెలిసినప్పుడు అవాక్కయిపోయాము. కాని మనం ఏమి కోల్పోయామో అర్థం చేసుకోలేకపోతున్నాము. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో పెట్టిన చద్దన్నం ఇప్పుడు వైరల్‌గా సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. రాత్రి అన్నం మిగిలింది అనుకొండి, ఓ కుండలో పెట్టి, గోరువెచ్చని పాలు పోసి, కాసేపాగి, కాస్త మజ్జిగ కలిపి అలా ఉంచేస్తారు, తెల్లవారాక పులిసిన ఆ అన్నంలోకి పచ్చి ఉల్లిపాయ, మిరపకాయ లేదా ఊరగాయ నంజుకుని కుమ్మేయడమే చద్దన్నం. దీనిని మన తాతలు, ముత్తాతలు ఎప్పుటి నుంచో వాడుతున్నారన్న విషయం నేటితరానికి ఇప్పుడే తెలుస్తోంది.