
ముంబైః విదేశీ వలసదారులకు అనుకూలంగా అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారతీయ విద్యావంతులు, వృత్తి నిపుణులు ఎంతగానో లబ్ధి పొందనున్నారు. అర్హతలున్న ఉద్యోగార్థులందరికీ ప్రయోజనం కలిగేలా బైడెన్ ప్రభుత్వం పౌరసత్వ పరీక్షలో కొన్ని ప్రధాన మార్పులు చేసింది. ముఖ్యంగా గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ పరీక్షకు స్వస్తి చెప్పింది. ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడంలో పౌరసత్వ పరీక్షకు ఉన్న కొన్ని ప్రధాన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోయాయి. 2008లో ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ పరీక్షనే కొనసాగించాలని కూడా బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
అమెరికాలో పౌరసత్వం పొందదలచుకున్న విదేశీ వలసదారులు తప్పనిసరిగా అక్కడి పౌర విజ్ఞానాన్ని తెలుసుకుని ఉండడంతో పాటు, ఇంగ్లీషులో మౌలికమైన అవగాహన కలిగి ఉండాలని అప్పట్లో ఒబామా ప్రభుత్వం ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. ఆ నిబంధనను తోసిరాజంటూ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధన అతి కఠినంగానూ, అతి జటిలంగానూ ఉండడంతో పాటు, సైద్ధాంతికంగా ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది.
అంతకు ముందు ప్రవేశపెట్టిన పౌరసత్వ పరీక్షలు 100 ప్రశ్నలు మాత్రమే ఉండేవి. ట్రంప్ ప్రభుత్వం ఆ సంఖ్యను 108కి పెంచింది. ఇందులో సగానికి సగం ప్రశ్నలు రాజకీయ కోణంలో ఉండేవి. 2020 డిసెంబర్ 1కి ముందు ఈ పౌరసత్వ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ నిబంధన వర్తించేలా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం ఈ ప్రశ్నావళి తీరుతెన్నులను కూడా మార్చివేసింది. పైగా బాగా సరళం చేసింది. దీనివల్ల వేలాది మంది భారతీయులతో సహా అనేక మంది విదేశీ వలసదారులు ఎంతో ప్రయోజనం పొందనున్నారు.