కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

AP Cabinet Meeting Highlights

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరిగింది. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45 వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంతో ఈ అంశంపై కూడా కేబినెట్‌ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

 


                    Advertise with us !!!