అదృశ్యమైన ఆ 136 మంది మరణించినట్లే..

uttarakhand-glacier-disaster-136-missing-people-to-be-declared-dead

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల అదృశ్యమైన 136 మంది మరణించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించాయి. దౌలీగంగా నదిలో వచ్చిన ఉప్పెన వల్ల అక్కడ ఉన్న రెండు పవర్‌ ప్లాంట్లు ధ్వంసం అయ్యాయి. తపోవన్‌ టన్నెల్‌లో చిక్కుకున్న పలువుర్ని రక్షించారు. ఆ టన్నెళ్ల నుంచి 69 మంది మృతదేహాలను కూడా వెలికితీశారు. కానీ ఆచూకీలేని మరో 136 మంది కోసం గత కొన్ని రోజులు నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉన్నది. ఘటన జరిగి రెండు వారాలు ముగుస్తున్నా.. గల్లంతు అయిన వారి ఆచూకీ చిక్కడం లేదు. దీంతో ఆ 136 మంది మరణించినట్లు ప్రకటించేందుకు ప్రభుత్వ వర్గాలు సిద్ధం అయ్యాయి. నందాదేవీ పర్వతశ్రేణుల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల ఆకస్మిక వరదలు వచ్చాయి.

చమోలీ ఘటన ఈనెల ఏడవ తేదీన జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉత్తరాఖండ్‌ ఆరోగ్యశాఖ మిస్సైనవారిని మరణించినట్లుగా గుర్తించింది. ఉత్తరాఖండ్‌ వరదలో సుమారు 204 మంది గల్లంతు అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్‌ సమయంలో 69 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 136 మంది ఆచూకీ లేకుండా పోయింది. అయితే అదృశ్యమైన వారి కుటుంబాలకు కోసం మరణ ద్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ బర్త్‌ అండ్‌ డెత్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌లో మార్పులు చేసింది. మూడు క్యాటగీరిల్లో మరణద్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న స్థానిక గ్రామస్థులకు ఒకటి, ఇతర జిల్లాలకు చెందినవారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడే డెత్‌ సర్టిఫికేట్‌ ఇవ్వనున్నారు.

 


                    Advertise with us !!!