భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు!

Chinese President Xi Jinping may visit India for BRICS summit

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఈ ఏడాది భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల సదస్సు ఈ ఏడాది భారత్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ సమావేశాలకు హాజరు అవుతారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌లో శిఖరాగ్ర సదస్సును నిర్వహించేందుకు చైనా మద్దతు తెలిపింది. సరిహద్దు సంక్షోభంతో సంబంధం లేకుండా.. ఆ సదస్సుకు హాజరు అవుతామని చైనా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆ భేటీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బ్రిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత్‌కు మద్దతు ఇస్తామని, ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పనిచేస్తామని, ఆర్థిక-రాజకీయ-భద్రతా సహకారానికి తోడ్పడుతామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు.

ఈ ఏడాది రెండవ అర్థభాగంలో ఆ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. లడాఖ్‌ సరిహద్దులో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం తగ్గుతోంది. రెండు దేశాలకు చెందిన దళాలు అక్కడ నుంచి ఉపసంహరిస్తున్నాయి. అయితే కోవిడ్‌ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సును వర్చువల్‌గా నిర్వహిస్తారా అన్న డౌట్స్‌ కూడా వ్యక్తం అవుతున్నాయి. 2017లో బ్రిక్స్‌ సమావేశాల కోసం మోదీ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే.