కేసీఆర్ అనుభవమే జగన్ కు కూడా ఎదురవుతుందా...?

Welfare Schemes of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ఎలాంటి సమస్యలు లేకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనే భావన వైసిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జరుగుతున్న లోపాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని తప్పులు వైసీపీ అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనే భావన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలే వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ముఖ్యమంత్రి వద్దకు చేరటం లేదు అని ఆవేదన చాలామందిలో ఉంది. 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో ఘనవిజయం సాధించింది. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం చూసి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో చాలావరకు ధీమా పెరిగింది అనే వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపించాయి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి వెనుకబడింది అనే అభిప్రాయం చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయని సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు దేవుడయ్యారు అనే అభిప్రాయాన్ని పదేపదే టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పడం వంటివి జరిగాయి. దీనితో సీఎం కేసీఆర్ కూడా కాస్త ధీమాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ ప్రభావం దుబ్బాక ఉప ఎన్నికల్లో గట్టిగా పడిందనే చెప్పాలి. అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధించింది తెరాస.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని అందుకున్న టిఆర్ఎస్ పార్టీ... దుబ్బాక ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఓడిపోయింది. దుబ్బాక నియోజక వర్గంలో దాదాపుగా 60 వేల మందికి పెన్షన్లు అందుతున్నాయి. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా సరే టీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి కనబడలేదు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే జరుగుతుందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.

కానీ క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోందనే భావన ఉంది. చాలా మంది వైసీపీ నేతలకు సన్నిహితంగా ఉండే వారు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారని లేకపోతే తమకు సహకరించిన వారికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రచారం ఉంది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా సరే వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేయడం లేదు అని ఆరోపణలు చేస్తున్నారు. రైతు భరోసా అమ్మఒడి వంటి సంక్షేమ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయి తప్పులు చాలా జరుగుతున్నాయి.

రైతు భరోసా విషయంలో రైతుల వద్ద నుంచి పాస్ బుక్స్ తీసుకుని కొంత మంది వైసీపీ నేతలు రైతు భరోసా తీసుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. దీనిమీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వాస్తవాలు వెళ్లడం లేదు అని ఆవేదన చాలా మంది వైసీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతు బంధు విషయంలో కూడా ఇలాంటివి ఎక్కువగా జరిగాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకునే వైసీపీ నేతలు క్షేత్రస్థాయి ఇబ్బందుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి జగన్ కు వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేస్తున్నారు.

 


                    Advertise with us !!!