ఆత్మనిర్భర భారత్ లో బెంగాల్ ది కీలక పాత్ర : మోదీ

PM Narendra Modi to unveil a slew of railway project

ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో బెంగాల్ ప్రధాన భూమిక పోషిస్తుందని, ప్రధాన కేంద్రంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్ కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాలు మరియు పొరుగు దేశాలతో వాణిజ్యం, వ్యాపార రంగాలు మెరుగైన దశలోనే ఉన్నాయని ఆయన వివరించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులను అధికంగా కేటాయించామని తెలిపారు. బెంగాల్‌లోని ‘హౌరా’ లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... బెంగాల్ ప్రజలు మార్పుకు సంసిద్ధంగానే ఉన్నారని ప్రకటించారు. బెంగాల్ చరిత్రను, సంస్కృతిని పరిపుష్టం చేయడం, సోనార్ బంగ్లాను నిర్మించడానికే తాము కృషి చేస్తున్నామని తెలిపారు. బెంగాల్ గడ్డపై నమ్మకం, ఆధ్యాత్మికత మెండుగా ఉంటాయని, అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తూ, బుజ్జగింపు రాజకీయాలు ఉండకూడదన్నారు. తాము కేవలం రాజకీయ పరివర్తన కోసమో ప్రయత్నించడం లేదని, సమూల మార్పు కోసమే తామంతా కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాంటి సమూల మార్పును కేవలం బీజేపీ మాత్రమే తీసుకొస్తుందని, అలాగే యువత లక్ష్యాలను కూడా చేరుకోడానికి అనువుగా ఉంటామని హామీ ఇచ్చారు. 

బెంగాల్ ప్రజలు మార్పు కోరుకోడానికి సిద్ధంగా ఉన్నారని పునరుద్ఘాటించారు. దుర్గాపూజ చేయడానికి, నిమజ్జనం చేయడానికి కూడా ప్రజలకు అనేక ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బెంగాల్ సంస్కృతిని కించపరిచే వారిని బెంగాలీలు ఎన్నటికీ క్షమించరని పరోక్షంగా సీఎం తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ఇన్ని రోజుల పాటు ఎలాంటి అభివృద్ధీ లేదు. ప్రజల మానాన ప్రజల్ని వదిలిపెట్టేశారు. అందుకే మార్పుకు సిద్ధంగా ఉన్నారు. సిండికేట్లుగా ఉన్న వారితో అభివృద్ధి అసాధ్యం. వ్యవస్థీకృత అవినీతి ఉన్నంత వరకూ అభివృద్ధి జరగదు.’’ అని మోదీ విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ బెంగాల్‌ను పాలించిన వారే, రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని, మా, మాటీ, మానుష్ అన్న నినాదాన్ని చేసిన వారే బెంగాల్ అభివృద్ధి నిరోధకులుగా మారారని తీవ్రంగా ఆరోపించారు. పేదలకు, రైతులకు కేంద్రం నేరుగా వారి అకౌంట్లలోకే డబ్బులు వేస్తోందని, అయితే ఈ డబ్బులు మాత్రం ప్రజలకు చేరకుండా తృణమూల్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీఎంసీ వ్యవస్థీకృత దోపిడీ చేస్తోందని, అందుకే తృణమూల్ నేతలు నానాటికీ సంపన్నులుగా మారిపోతున్నారని, ప్రజలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారని మోదీ విమర్శించారు. 

అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు అసోంపై సవతి తల్లి ప్రేమను చూపాయని విమర్శించారు. అన్ని విధాలా, అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందే లక్షణాలు అసోంకు ఉన్నాయని, అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. వివిధ రంగాల్లో అసోం రాష్ట్రం సాధించిన అభివృద్ధి శూన్యమని, అది గత పాలకుల పాపమేనని అన్నారు. అసోంకు ఢిల్లీకి మధ్య పెద్ద దూరమేమీ లేదని, ఢిల్లీ మీ తలుపుల దగ్గరే ఉందని, మీ ముందే నిలిచి ఉందని వ్యాఖ్యానించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న ఏకైక లక్ష్యంతో సీఎం సోనోవాలా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందని, ఇప్పటికే జోగీబీల్ వంతెనను పూర్తి చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదిపై కాలియోబోమొరా వంతెనను ప్రారంభించి, అసోంతో మిగితా ప్రాంతాలను అనుసంధానం చేశామని మోదీ వివరించారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పై మోదీ వ్యాఖ్యలు

త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పై మోదీ వ్యాఖ్యానించారు. మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. గతంలో మార్చి నాలుగో తేదీన షెడ్యూల్‌ను ప్రకటించారని, అయితే ఈసారి మార్చి 7న ప్రకటించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల తేదీల ప్రకటన అనేది ఈసీ పరిధిలోనిది. అయితే ప్రకటించే లోపే అసోం, బెంగాల్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళలో పర్యటిస్తా.’’ అని మోదీ వివరించారు.

 


                    Advertise with us !!!