
మూడు రాజధానుల విషయంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ చాలా పట్టుదలగా ఉన్నారనేది వైసీపీ నేతలు మీడియా ముందు కనపడిన ప్రతీసారి చెప్పే మాట. రాజకీయంగా కేవలం తమ మీదున్న కక్ష సాధింపుతో విశాఖ ప్రజలకు రాజధానిని దూరం చేసే కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు పదే పదే అంటూ ఉంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనడంలో తప్పు లేదుగాని... పరిపాలన వికేంద్రీకరణ అనేది తీరని సమస్యలకు దారితీస్తుంది అనేమాట టీడీపీ నేతలు చెప్తూ వస్తున్నారు. విశాఖ ప్రజలకు వాస్తవాలు తెలుసనీ వైసీపీ అంటూ వచ్చింది.
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి రాజధాని వచ్చేస్తుంది కొబ్బరికాయ కొట్టేస్తున్నామని అంటూ ఉంటారు. మరి ప్రజల మనోగతం ఏంటీ...? విశాఖకు పరిపాలనా రాజధాని వస్తే అన్ని ప్రాంతాలు తమ మీద ఆధారపడతాయి కాబట్టి తమకు చాలా మేలు జరుగుతుందని విశాఖ ప్రజలు భావించి, తమ భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారని భావించారు. కాని అలాంటి వాతావరణం స్థానిక ఎన్నికల్లో కనపడలేదనే మాట అర్ధమవుతుంది. స్థానిక ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదుర్కొంది అధికార వైసీపీ.
కీలక నేతల నియోజకవర్గాల్లో వైసీపీ పంచాయితీలు గెలవలేదు. అరకు లోయలో గిరిజనులు 2019 ఎన్నికల్లో వైసీపీని ఆదరించినా ఇప్పుడు పక్కన పెట్టేసారు. ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అరకు పార్లమెంట్ పరిధిలో వైసీపీ అనుకున్న విధంగా పంచాయితీలు గెలవలేదు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభావం చూపించలేకపోయింది. నాలుగు దశల ఎన్నికల్లో కూడా టీడీపీ సత్తా చాటింది. జనసేన, సిపిఐ, బిజేపి సైతం కొన్ని కొన్ని ప్రాంతాల్లో పంచాయితీలను కైవసం చేసుకున్నాయి.
విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ల పరిధిలో కూడా వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. గుడివాడ అమరనాథ్ నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఎదురు గాలి వీచింది. దీనితో వైసీపీ సర్కార్ పునరాలోచనలో పడిందనే విషయం చెప్పాలి. వైసీపీ అగ్ర నేతలు ప్రచారం విషయంలో స్థానిక నాయకులకు సహకారం అందించి అనేక రకాల ప్రోత్సాహకాలు అందించినా సరే వైసీపీని ప్రజల్లో నిలవలేదు. రాజధాని అనే అంశాన్ని పక్కన పెడితే... సంక్షేమ కార్యక్రామాల అమలు వైసీపీకి అనుకూలంగా మారుతుందని అందరూ భావించారు.
ఇళ్ళ పట్టాలు, ఇతర కార్యక్రమాలు ఏ విధంగా కూడా ప్రభావం చూపించలేదు. అమరావతి ప్రాంతంలో పట్టుదలగా గెలిచిన వైసీపీ... విశాఖను మాత్రం పట్టించుకోలేదు. ధీమాగా ముందుకు వెళ్లి ఎదురుదెబ్బ తిన్నది. అమరావతిలో ఓటమి కంటే విశాఖలో విజయమే టీడీపీకి సంతోషంగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్కడికి వెళ్ళగా... ఆయన పర్యటనకు వచ్చిన మంచి స్పందన చూసి... జిల్లా వైసీపీ నేతలు కాస్త పునరాలోచనలో పడవచ్చు. జనసేన పార్టీ ప్రభావం కూడా విశాఖ జిల్లాలో కనపడింది. కాబట్టి... రాజధాని అనే అంశం, సంక్షేమ కార్యక్రమాల అమలు అనే ప్రచారం వైసీపీని విజయతీరాలకు చేర్చలేదు అనే విషయాన్ని వైసీపీ అధిష్టానం గ్రహించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాయలసీమ నేతల ప్రభావం విశాఖలో తగ్గిస్తే మంచిదని, సంబంధం లేని వ్యక్తులు దూరంగా ఉంటే వైసీపీ మళ్ళీ తిరిగి నిలబడే అవకాశం ఉంటుందని, మూడు రాజధానుల విషయంలో ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయం తెలుసుకోవాలని, ఏకపక్ష నిర్ణయాల విషయంలో ఆలోచించాలని సూచిస్తున్నారు.