కేసీఆర్ ధోరణి లో మార్పు వచ్చిందంటున్నారు. నిజమేనా?

There seems to be a change in the KCR trend

తెలంగాణా సిఎం కేసీఆర్ చాలా అంశాల్లో మొండి వ్యక్తి... రాజకీయం అయినా పరిపాలన అయినా సరే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపుగా అమలుచేసి తీరాల్సిందే అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. కేసీఆర్ కు అతి దగ్గరగా ఉండే వ్యక్తులు మినహా చాలా మంది నేతలు చెప్పే అభిప్రాయాలను ఆయన తెలుసుకునే ప్రయత్నం అసలు చేయరు. కాని ఇప్పుడు సీఎం కేసీఆర్ వైఖరిలో చాలా మార్పు వచ్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెరాస పార్టీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అభ్యర్ధి విషయంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రచారానికి మీరు రావాలని కోరినా సరే పక్క నియోజకవర్గాలలో కార్యక్రమాలు నిర్వహించారు గాని, అక్కడికి వెళ్ళలేదు. ఒకపక్క బిజేపి నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు వరుస పర్యటనలు చేసి, గ్రామాల్లో తిరిగితే, అభ్యర్ధిని బలమైన వ్యక్తిని నిలబెడితే కేసీఆర్ కనీసం ప్రచారానికి వెళ్ళలేదు. ఈ ప్రభావంతో తెరాస పార్టీ ఓటమి పాలైంది... గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది.

చాలా మంది అభ్యర్ధుల విషయంలో స్థానిక నేతల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించలేదు. కనీసం పార్టీ పరిస్థితి ఏంటీ అనే సర్వే కూడా హైదరాబాద్ లో చేయలేదు. దీనితో మజ్లీస్ పార్టీ మద్దతుతో తెరాస మేయర్ ను కైవసం చేసుకుంది. కాని ఇప్పుడు కేసీఆర్ లో చాలా మార్పు వచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు. కేటిఆర్ ను సిఎంను చేయాలని కేసీఆర్ యాగాలు చేసారని బండి సంజయ్ అన్నారు. ఆ తర్వాత చాలా మంది తెరాస నేతలు విపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు.

కేసీఆర్ చాలా స్పీడ్ గా అడుగులు వేసి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కాని సీనియర్ నేతలు అందరూ కూడా కేసీఆర్ ను కలిసి... ఈటెల రాజేంద్ర నుంచి వచ్చే సమస్యలు, హరీష్ రావు వర్గం నుంచి వచ్చే సమస్యలు, ఇతర సీనియర్ నేతల నుంచి వచ్చే ఇబ్బందులు, బిజెపికి ఏ విధంగా ఇది అనుకూలంగా మారుతుందనే  వివరణలు ఇచ్చిన తర్వాత, కొంతమంది అగ్ర నేతలు లేఖలు రాసి, రాయబారాలను పంపిన తర్వాత కేసీఆర్ డ్రాప్ అయిపోయారు. సిఎం మార్పు అనే అంశం గురించి మాట్లాడటానికి వీలులేదని చెప్పేశారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్ధి విషయంలో కూడా అదే జరుగుతుంది. షర్మిల పార్టీ పెట్టి... నిజంగా బరిలోకి దిగితే... తెరాస పార్టీ కోల్పోయే రెడ్డి ఓటు బ్యాంకు, క్రైస్తవ ఓటు బ్యాంకు గురించి నివేదికలను కేసీఆర్ కు పంపించారు. ఆయన అన్ని విధాలుగా పరిశీలించి ఇప్పుడు అభ్యర్ధి విషయంలో, అనుసరించాల్సిన వ్యూహం విషయంలో పునరాలోచనలో పడ్డారు. ముందు చిన్నపు రెడ్డిని ఎంపిక చేయాలని భావించినా... కాదు కూడదు అని మరో నేత మీద ఫోకస్ పెట్టారు. షర్మిల పార్టీ వలన క్రైస్తవ ఓటు బ్యాంకు దూరం కావోచ్చనే పక్కా అంచనా కేసీఆర్ కు అందింది.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక పరిపాలనలో కీలకమైన సంక్షేమ కార్యక్రమాల మీద కూడా కేసీఆర్ ఆలోచనలో పడిపోయారు. నిరుద్యోగ భ్రుతిని అమలు చేసే విషయంలో చాలా మంది నేతల అభిప్రాయాలను తెలుసుకుని, అమలు చేద్దామనే గ్రీన్ సిగ్నల్ కేసీఆర్ ఇచ్చేసారట. ఇలా కేసీఆర్ లో చాలా మార్పు వచ్చిందని తెరాసలో ఆయనను దగ్గరగా గమనిస్తున్న వారు చెప్పేస్తున్నారు.