అగ్రరాజ్యంలో కరోనా మరణాలు 5 లక్షలు!

US nears 5 lakh Covid-19 deaths

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం రాత్రివరకు అక్కడ మొత్తం 4.98 లక్షల కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదికలు ఈ వివరాలను వెల్లడించాయి. కాగా, అమెరికాలో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం నమోదైంది. అప్పటి నుంచి తొలి నాలుగు నెలల్లో అంటే మే నెల చివరికల్లా అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో 2 లక్షల మార్కను, డిసెంబర్‌లో 3 లక్షల మార్కును అమెరికా కరోనా మరణాలు అధిగమించాయి. అనంతరం ఈ ఏడాది జనవరి 19నాటి కరోనా చావులు 4 లక్షలు దాటాయి. ఫిబ్రవరి 21 నాటికి 4.98 లక్షల కరోనా మరణాలు రికార్డయ్యాయి.

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 5 లక్షలకు కేవలం రెండు వేల దూరంలో ఉన్న క్రమంలో శ్వేత సౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ మృతులకు నివాళులు అర్పించబోతున్నారు. మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటన చేసింది. కాగా, అమెరికాలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 2.80 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 25 లక్షలు దాటింది.

 


                    Advertise with us !!!