
న్యూయార్కు లోని ఫ్లషింగ్ లోని ఒక భవనం లో ఫిబ్రవరి 14 సోమవారం ఉదయం దాదాపు 1 గంట ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో తీవ్ర ఆస్తినష్టం జరగడమే కాకుండా ఇందులో నివసిస్తున్న మూడు కుటుంబాల వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తున్న వీరు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
విషయం తెలుసుకున్న న్యూయార్క్ తెలంగాణా తెలుగు సంఘం (NYTTA) తక్షణమే రంగంలోకి దిగి ఈ తెలుగు కుటుంబాల అగ్నిప్రమాద బాధితులకు మనో ధైర్యాన్ని అందించి అండగా నిలచింది. తాత్కాలిక ఆశ్రయం కల్పించడం లో రెడ్ క్రాస్ వారితో కలిసి పనిచేయడమే కాకుండా నిత్యావసర వస్తువులతో పాటు $1500 డాలర్లు ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్నది. వారు త్వరలోనే పూర్తిగా కోలుకుని సాధారణ జీవితంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా “నైటా” సంస్థ అధ్యక్షులు రమ వనమ సకాలంలో విచ్చేసిన తన సహచర “నైటా” టీం సభ్యులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు.
అలాగే “నైటా” ఎల్లవేళలా తెలుగువారి సేవలో ముందుండేoదుకు కృషి చేస్తుందని వారికి ఏ సహాయ సహకారాలు అవసరమైనా ఆపన్నహస్తం అందిస్తుంది అని తెలియజేశారు.