విదేశాల్లో పెరుగుతున్న తెలంగాణ సంస్కృతి

Growing Telangana Culture Abroad

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను, బతుకమ్మ, బోనాలు వంటి సంప్రదాయ పండుగలను నేటితరానికి తెలియజేస్తూ, తెలంగాణ కమ్యూనిటీకోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు వివిధ దేశాల్లో, వివిధ నగరాల్లో తెలంగాణ సంఘాలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న సంఘాలతోపాటు, రాష్ట్రం ఏర్పాటయ్యాక వస్తున్న సంఘాలతో అమెరికాలోని వివిధ నగరాల్లో చాలాచోట్ల ‘తెలంగానం’ వినిపిస్తోంది. అమెరికాతోపాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‍, సింగపూర్‍, యుకె వంటి దేశాల్లో కూడా తెలంగాణ సంస్కృతి వేగంగా వ్యాపిస్తోంది.

తెలంగాణ భాష, యాస, కళలు, పండుగలు, సంస్కృతీ చాలామందికి తెలియకపోవచ్చు. అదే సమయంలో అమెరికాలో ఉన్న యువతరానికి తెలంగాణ సంస్కృతి తెలియజేయాలంటే బలమైన వేదికలు అవసరమని తెలంగాణ ఎన్నారై ప్రముఖులు భావించారు. తెలంగాణ రాష్ట్రంలోని మేధావుల నుంచి వచ్చిన సూచనలతో తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ సంస్కృతి విస్తరణకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే వివిధ నగరాల్లో తెలంగాణవాసుల కోసం కొత్తగా తెలంగాణ సంఘాలను ఏర్పాటు చేయడం చేశారు. ఇలా ఏర్పడిన తెలంగాణ సంఘాల వల్ల నేడు చాలాచోట్ల బోనాలు, బతుకమ్మ వేడుకలు, తెలంగాణ సాహిత్య కార్యక్రమాలు, తెలంగాణ ప్రముఖులతో చర్చాగోష్టులు వైభవంగా జరుగుతోంది. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు అమెరికాలోని తెలంగాణ సంఘాలు ఎంతో కృషి చేశాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావు సంకల్పానికి అనుగుణంగా చాలా తెలంగాణ సంఘాలు ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించాయి. కొన్ని తెలంగాణ సంఘాలు రాష్ట్రంలోని పేద రైతులను, విద్యార్థులను ఆదుకునేందుకు కూడా నడుం బిగించాయి.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందు నుంచే...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వివిధ దేశాల్లో తెలంగాణ ఉనికి  కొన్నిచోట్లకే పరిమితమై ఉండేది. అమెరికా దేశం లో తెలంగాణ నుంచి వచ్చిన ఎన్నారై  ప్రముఖులు 1999లో  తెలంగాణ డెవలప్‍మెంట్‍ ఫోరమ్‍ ని ప్రారంభించి తమ జన్మభూమికి సహాయంగా కార్యక్రమాలు చేసేవారు. బే ఏరియా లో ఉండే విజయ్‍ చావా ఆరోజుల్లోనే  తెలంగాణ కల్చరల్‍ ఫోరమ్‍ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 2007 నుంచి 2009 వరకు తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా శ్రీమతి కల్వకుంట కవిత అమెరికా వచ్చి బతుకమ్మ పండగ విశిష్టత వివరించి కొన్ని పెద్ద పట్టణాలలో బతుకమ్మ వేడుకలు జరిపేలా చూశారు. ఆ వేడుకల విశేషాలు ఒక్కో నగరం నుంచి ఇతర నగరాలకు కూడా వెళ్ళటం, ఆ నగరాలలో కూడా వేడుకలు జరగటంతో తెలంగాణ సంస్కృతి అమెరికాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని చెప్పాలి.

అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్‍ సారధ్యంలో ఊపందుకోవడంతో ఈ ఉద్యమంలో మేముసైతం అంటూ ముఖ్యంగా అమెరికాలోని కొంతమంది ఎన్నారైలు ముందుకు వచ్చారు. అమెరికాలోని ఎన్నారైలు తెలంగాణ కల్చరల్‍  ఫోరంను ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ప్రజానీకాన్ని తమ కార్యక్రమాల ద్వారా కూడగట్టారు. కాలిఫోర్నియాలో పెద్దఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి దృష్టిని తెలంగాణ ఉద్యమంవైపు చూసేలా చేశారు. వివిధ చోట్ల చిన్నచిన్నగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలపై వేడుకలు జరగడం మొదలయ్యాయి.

తెలంగాణ డెవలప్‍మెంట్‍ ఫోరం (టిడిఎఫ్‍) నుంచి  కొందరు ఎన్నారైలు తెలంగాణ ఉద్యమానికి అమెరికా నుంచి అన్నీ విధాలుగా మద్దతును అందించారు. టీడిఎఫ్‍ ఏర్పడిన తరువాత ఉద్యమంలో ఎన్నారైల పాత్ర విస్తృతమైంది. మరోవైపు అమెరికాలో కూడా ఎన్నారైల మద్దతును కూడగట్టేందుకు టీడిఎఫ్‍ తెలంగాణ రాష్ట్రంలోని మేధావులతో చర్చాకార్యక్రమాలను, సదస్సులను ఏర్పాటు చేసి చైతన్యపరిచింది.  సెమినార్‍లు, బతుకమ్మ ఇతర పండుగలను వైభవంగా జరపడంతోపాటు తెలంగాణ వాసులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఇక్కడ ఉన్న వారిని జాగృతం చేసి సహాయపడేలా చూడటం వంటి బాధ్యతలను నిర్వహించింది. అమెరికాలో పెద్ద సంస్టలైన అమెరికా తెలుగు అసోసియేషన్‍ (ఆటా) నాయకులు సుధాకర్‍ పెర్కారి, గోపాల్‍ రెడ్డి గాదె లాంటి నాయకులు  టీడీఎఫ్‍కి కూడా నాయకత్వం వహించి  టీడీఎఫ్‍ని ఒక జాతీయ సంస్థగా తయారు చేసి, అన్ని నగరాలలో వున్న తెలంగాణ ఎన్‍ ఆర్‍ఐ లను, అభిమానులను సంస్థ లోకి తీసుకువచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత...

తెలంగాణ రాష్ట్రం కోసం అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు ఎంతగా పోరాడారో, అదే విధంగా రాష్ట్రం  ఏర్పడ్డాక కూడా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో కూడా సహాయపడుతున్నారు. తెలంగాణ భాష, యాస, కళలు, పండుగలు, సంస్కృతీ అమెరికాలో ఉన్న యువతరానికి తెలియజేయాలంటే బలమైన వేదికలు అవసరమని భావించి వివిధ నగరాల్లో కొత్తగా తెలంగాణ సంఘాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పడిన తెలంగాణ సంఘాల వల్ల నేడు చాలాచోట్ల బోనాలు, బతుకమ్మ వేడుకలతోపాటు, ప్రపంచ తెలంగాణ మహాసభలు వంటివి వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు అమెరికా ఎన్నారైలు ఎందరో కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో  తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‍ రావు సంకల్పానికి అనుగుణంగా చాలా సంఘాలు ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను, పరిరక్షించడంతోపాటు మాతృరాష్ట్ర ప్రముఖులను అమెరికాకు రప్పించి వారిచేత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, చేయనున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. కొన్ని   సంఘాలు రాష్ట్రంలోని పేద రైతులను, విద్యార్థులను ఆదుకునేందుకు కూడా నడుం బిగించాయి.

అప్పటి టీడీఎఫ్‍ అధ్యక్షులు విషు కలవల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అమెరికా నుంచి మా సంస్థ తరుపున ముఖ్యమైన నాయకులు హైదరాబాద్‍ వెళ్లి ప్రభుత్వ అధికారులతో అనేకసార్లు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలు చర్చించామని, అవి చాలావరకు  కార్యరూపం దాల్చటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ సమయంలోనే ఆవిర్భవించిన ఇంకొక జాతీయ సంఘం అమెరికన్‍ తెలంగాణ సొసైటీ మాజీ అధ్యక్షులు రామ్మోహన్‍ కొండా మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అనేక విషయాలపై సూచనలు ఇచ్చామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన వేడిలో, ఆవేశంలో, ఆకర్షణలో అమెరికాలో చాల పట్టణాలలో తెలంగాణ తెలుగు సంఘాలు ఏర్పాడ్డాయి. ఆవేశంలో ఏర్పడినా ఆ సంఘాలు అన్ని మెల్ల మెల్లగా తమ విధి విధానాలు  ఏర్పరుచుకొని, తమ కార్యక్రమాలు చెయ్యటం మొదలు పెట్టి ఆ నగరంలో వున్న తెలంగాణ వారినే కాక, తెలుగు వారిని కూడా ఆకట్టుకొంటున్నాయని చెప్పాలి.

విదేశాల్లో విస్తృతమైన బతుకమ్మ, బోనాలు

తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాలు నేడు అమెరికాలోని ప్రతి నగరాల్లో జరుగుతున్నాయి. తెలంగాణ సంఘాలతోపాటు, ఇతర తెలుగు సంఘాలు కూడా తమ సభ్యులకోసం ఈ పండుగలను వేడుకగా నిర్వహిస్తున్నాయి. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన సభ్యులకోసం వివిధ నగరాల్లో ఈ పండుగలను, ఇతర సంఘాలతో కలిసి వైభవంగా నిర్వహిస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న  బే ఏరియా తెలుగు అసోసియేషన్‍ (బాటా), డల్లాస్‍లో ఉన్న టెక్సాస్‍ తెలుగు సంఘం (టాంటెక్స్) వంటి ఎన్నో తెలుగు సంఘాలు ఈ పండుగలను విశేషంగా చేస్తున్నాయి. అమెరికాతోపాటు ఇతర దేశాల్లో కూడా ఈ పండుగలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యునైటెడ్‍ కింగ్‍డమ్‍, ఆస్ట్రేలియా, సింగపూర్‍, న్యూజిలాండ్‍ వంటి దేశాలతోపాటు ఇతర దేశాల్లో కూడా ఈ వేడుకలను పెద్ద ఎత్తున చేస్తున్నారు.

తెలంగాణ ప్రపంచ మహాసభలు

స్వాతంత్య్రోద్యమానికి ముందునుంచే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. మహాకవి దాశరధి కీర్తించినట్టుగా ‘తెలంగాణ కోటి రతనాల వీణ’. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపదకు తెలంగాణ పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమసారథి మాత్రమేకాదు. పరిపాలనాదక్షుడు. భాషాభిమాని, సాహిత్యపిపాసి. బతుకమ్మ వైభవాన్ని రాష్ట్రం నలుమూలలా నిర్వహించేలా ప్రభుత్వం తరపున చేశారు. తెలంగాణ భాష, చరిత్ర, కళలు, పండుగలు, సంప్రదాయాలను విశ్వవ్యాప్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయన నిర్వహించిన తెలంగాణ ప్రపంచ మహాసభలు విశేషంగా జరిగాయి. దేశ, విదేశాల్లోని ఎంతోమంది ఈ ప్రపంచ మహాసభలకు హాజరయ్యారు. తెలంగాణ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా మహాసభలు జరిగాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాల్లో పేరుగాంచిన ప్రముఖులు, ఎన్నారైలు ఎందరో ఈ ప్రపంచ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు.

డిసెంబర్‍ 2017, 15వ తేదీన హైదరాబాద్‍లో ప్రారంభమైన ఈ మహాసభలు 19వ తేదీ వరకూ అవిఛ్చిన్నంగా తెలుగువారి సర్వస్వాన్ని, తెలుగువాళ్ళ అస్తిత్వాన్ని సమావిష్కరించేలా జరిగింది.  మహాసభలకు తెలంగాణ నుంచి వేలాదిమంది ప్రజలు, కవులు, సాహితీవేత్తలు, రచయితలతోపాటు 42 దేశాలనుంచి ఎన్నారై ప్రతినిధులు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలనుంచి భాషాభిమానులు పెద్దఎత్తున ఈ సమావేశాలలో పాల్గొన్నారు. పదిహేను వందల ఏండ్ల తెలంగాణ సాహిత్యం, ఇక్కడ వచ్చిన రచనలు, పుట్టిన పక్రియలపై దృశ్యమాధ్యమం ద్వారా అందరికీ పరిచయం చేశారు. తెలంగాణ ప్రాంతంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాష ఉన్నదనడానికి తగిన ఆధారాలున్నాయని, కోటి లింగాలలో లభ్యమైన క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి నాణేలే అందుకు నిదర్శమని మహాసభల్లో కేసీఆర్‍? కుమార్తె కవిత అన్నారు. వాటిపై గోబద, నారన, సమవాప అనే తెలుగు పదాలు లభ్యమయ్యాయని గుర్తుచేశారు. వాటి ఆధారంగానే తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిందని పేర్కొని తెలంగాణ భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. 2017 డిసెంబర్‍ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు  సభలు ఒక విధం గా  చెప్పాలంటే  తెలుగు వారందరికీ తెలంగాణ చరిత్ర ఏమిటి, చరిత్ర కారులు ఎవరు, తెలంగాణ లో పుట్టి భాషను పెంచిన కవులు, పండితులు, రచయితలు ఎవరు అన్న విషయం తెలిపింది. అంతే కాదు .. అసలు తెలంగాణ సంస్క•తి ఏమిటి అన్న విషయం కూడా ప్రపంచానికి తెలిపింది. ఆ సభలు నిర్వహించాలని అనుకొన్న ముఖ్యమంత్రి శ్రీ చణ్డర శేఖర్‍ రావుగారిని, ఆ సభలకు నాయకత్వం వహించిన మంత్రులకు, అధికారులకు, సమన్వయము చేసిన శ్రీమతి కవిత గారిని తప్పనిసరిగా అభినందించాలి.

ఈ తెలుగు మహా సభలు నిర్వహణలో  ప్రపంచం లోని తెలంగాణ తెలుగు ప్రముఖులని పిలిచి, వారి సలహా - సూచనలు తీసుకోవటం, వారిని గౌరవించి ‘ మీరే ఈ రాష్ట్రానికి అంబాసిడర్‍ లు. మీరు ఈ రాష్ట్రాన్నీ మీ దేశాలలో   వినిపించాలి- ఈ రాష్ట్రానికి మీ మీ దేశాల్లో గౌరవ మర్యాదలు తేవాలి ‘‘ అని  ముఖ్యమంత్రి స్వయంగా వారితో చెప్పి వారిని ఉత్సాహ పరచటం ఒక మంచి పరిణామం. విదేశాల నుంచి తెలంగాణ ప్రముఖులను తెలుగు మహా సభలకు ఆహ్వానించి, వారిని మహాసభలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించేలా చూశారు. టీఆర్‍ఎస్‍కి ఎన్‍ఆర్‍ఐ  కోఆర్డినేటర్‍ గా ఉన్న మహేష్‍ బిగాల మాట్లాడుతూ తెలుగు మహాసభలకు దాదాపుగా 200 మంది 50 దేశాల నుంచి వచ్చారని , తెలంగాణ  సాంస్కృతికంగా అభివృద్ధి చెందటానికి వారు అనేక సలహాలు ఇచ్చారని, వారే ఇప్పుడు వారి వారి నగరాలలో  తెలంగాణకి గుర్తింపు తెస్తున్నారని, వారికి అభినందనలు అని తెలిపారు.

అమెరికాలో జాతీయ తెలంగాణ సంఘాలు 

అమెరికాలో వివిధ నగరాల్లో ఏర్పడిన తెలంగాణ సంఘాలకు తోడ్పడేలా జాతీయ తెలంగాణ సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో న్యూయార్క్ ప్రముఖులు డా. పైళ్ళ మల్లారెడ్డి తెలంగాణ అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ను ఏర్పాటు చేశారు. జాతీయ తెలంగాణ సంఘంగా పేరు పొందిన ఈ సంఘం ద్వారా వివిధ కార్యక్రమాలను, మహాసభలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అమెరికా తెలంగాణ సొసైటీ (ఎటిఎస్‍) పేరుతో మరో జాతీయ తెలంగాణ సంఘం కూడా ఆవిర్భవించింది. కరుణాకర్‍ మాధవరం తదితరులు ఈ ఎటిఎస్‍ను ఏర్పాటు చేశారు.

వివిధ దేశాల్లో విస్తృతమైన తెలంగాణ సంఘాలు

అమెరికాతోపాటు న్యూజిలాండ్‍, ఆస్ట్రేలియా, సింగపూర్‍, యుకె తదితర దేశాల్లో తెలంగాణ సంఘాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ఆయా సంఘాలు ఆయా దేశాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను చేస్తున్నాయి. తెలంగాణ వైభవాన్ని చాటడంతోపాటు, తెలంగాణ ఎన్నారైలకు అవసరమైన సహాయాన్ని సహకారాన్ని కూడా అందిస్తున్నాయి.

తెలంగాణజాగృతి

తెలంగాణ చైతన్యాన్ని ప్రజల్లో మేల్కొలుపుతూ, తెలంగాణ చరిత్ర, సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‍రావు తనయ, ఎమ్మెల్సీ కవిత ఆలోచనల్లో నుంచి ఉద్భవించిన సంస్థ ఇది. సమాజంలోని అన్నీ వర్గాలవారికి చేరువ అయ్యేలా దీనిని కవిత తీర్చిదిద్దారు. తెలంగాణ ఉద్యమసమయంలో ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల గొప్పదనాన్ని చాటిచెబుతూ వారిని ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తెలంగాణ జాగృతి విజయవంతమైంది.  తెలంగాణలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేసేందుకు తెలంగాణ జాగృతిని ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళడంలో కవిత సక్సెస్‍ అయ్యారు. పలు దేశాల్లో నేడు తెలంగాణ జాగృతి విస్తృతమైంది.  ప్రజల్లో మన సంస్కృతిని వ్యాప్తి చేయడం, బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడం వంటివి తెలంగాణ జాగృతి ద్వారా చేస్తున్నారు.  తెలంగాణ జాగృతిని వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు విస్తరించడంతోపాటు వాటిని సమర్థవంతంగా నడిపేందుకు వీలుగా కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేసి వాటికి నాయకులుగా పలువురిని కవిత నియమించారు.

టీఆర్ఎస్ఎన్నారై శాఖలు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో ఎంతోమంది ఎన్నారైలు కూడా కీలకపాత్ర పోషించారు. కేసీఆర్‍ ఉద్యమ సమయంలో ఎన్నారైలు ఆయన పట్ల ఆకర్షితులై ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కేసీఆర్‍ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నారైలను సమన్వయం చేసేందుకు వీలుగా నిజామాబాద్‍కు చెందిన మహేష్‍ బిగాలను టీఆర్‍ఎస్‍ ఎన్నారై కో-ఆర్డినేటర్‍గా నియమించారు. వివిధ దేశాల్లో టీఆర్‍ఎస్‍ ఎన్నారై శాఖలను ఆయన ఏర్పాటు చేసి వాటికి కార్యవర్గాన్ని కూడా పార్టీ అధినాయకులను సంప్రదించి నియమించారు.  ఇప్పటికే 50కి పైగా దేశాల్లో టీఆర్‍ఎస్‍ ఎన్నారై శాఖలు చురుకుగా పని చేస్తున్నాయి. తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ సంప్రదాయాలను ఇవి విశ్వవ్యాప్తం చేస్తున్నాయి.

యూకేలో అనిల్‍ కూర్మాచలం, ఆస్ట్రేలియాలో కాసర్ల నాగేందర్‍, న్యూజీలాండ్‍లో జగన్‍ వాడ్నలా, డెన్మార్క్ లో శ్యామ్ బాబు ఆకుల, సౌత్‍ ఆఫ్రికాలో నాగరాజు గుర్రాల, ఒమాన్‍లో మహిపాల్‍ రెడ్డి, బహరేన్‍లో సతీష్‍ రాధారపు, కువైట్‍లో అభిలాష, జర్మనీలో అరవింద్‍లాంటి వారు ఆయా దేశాల్లో తెలంగాణ సంస్కృతి పెరిగేలా కృషి చేస్తున్నారు.

ముగింపు

ఆ  విధంగా ఆవేశంగా మొదలయిన తెలంగాణ కార్యక్రమాలు, ఆలోచనగల యువకులు- పెద్దవాళ్ళతో పరిణితి చెంది ఇప్పుడు అమెరికాలోనే కాక వివిధ దేశాలలో వున్నా తెలుగు కమ్యూనిటీలో  భాగంగా రూపాంతరం చెందాయి. ప్రతి పట్టణంలోను ఇప్పుడు బతుకమ్మ వేడుక అంటే తెలంగాణ వారిది మాత్రమే కాదు.. అది అందరి పండుగ అనే భావన కలిగేలా  కార్యక్రమాలు జరుగుతున్నాయి.  అందరి మద్దతు, ఆమోదం, ప్రోత్సహం లభిస్తున్నాయి. అలాగే అమెరికాలోని అన్ని పట్టణాలలో స్వీట్స్- స్నాక్స్ షాప్‍లలో  ఆంధ్ర ప్రదేశ్‍లో దొరికే బందరు లడ్డు, కాకినాడ కాజా ,గోదావరి జిల్లాల  పూతరేకులతోపాటు తెలంగాణలో ఆదరణ పొందిన  సకినాలు, మురుకులు కూడా  దొరుకుతాయి.  రెస్టారెంట్‍లలో  గుంటూరు గోంగూర, విజయవాడ ఉలవచారుతోపాటు, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పచ్చి పులుసు, సజ్జ రోటీలు, ఉప్పుడు పిండి కూడా దొరుకుతాయి.  ఈ విధమైన మార్పుకి కారణమైన తెలంగాణ సంఘాలను, తెలంగాణ తెలుగు పెద్దలను అభినందించాలి.

 


                    Advertise with us !!!