
ఉద్యోగాలు కోల్పోయిన మహిళల సంఖ్య 25 లక్షల పైచిలుకేః కమలా హారిస్
వాషింగ్టన్ః కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 25 లక్షల మందికి పైగా మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని, ఈ పరిస్థితిని ‘నేషనల్ ఎమర్జెన్సీ’గా పరిగణించాల్సి ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. కరోనా సహాయ పథకంలో అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశాన్ని కూడా చేర్చబోతున్నారని ఆమె వెల్లడించారు.
కార్మిక విభాగం అందజేసిన వివరాల ప్రకారం, కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన పురుషుల సంఖ్య 18 లక్షలని, పురుషులతో పోలిస్తే కరోనా వల్ల దెబ్బతిన్న మహిళల సంఖ్య చాలా ఎక్కువని ఆమె అన్నారు. ప్రతినిత్యం ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు కరోనా మహమ్మారి మరింత భారాన్ని, బాధ్యతల్ని మోపిందని అంటూ కమలా హారిస్, శిశు సంరక్షణ, తప్పనిసరిగా సెలవులు పెట్టి సొంత ఊర్లకు వెళ్లాల్సి రావడం వంటివి మహిళలను ఉద్యోగాలకు దూరం చేశాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందని వివరించారు.
‘‘మహిళలు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు చేస్తే తప్ప దేశ ఆర్థిక రంగం పూర్తిగా కోలుకోదు’’ అని ఆమె స్పష్టం చేశారు. ఆమె పలు మహిళా సంఘాల నాయకులతోనూ, శాసనకర్తలతోనూ వీడియో కాల్లో మాట్లాడుతూ, బైడెన్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వదలచుకుందని తెలిపారు.
మహమ్మారి సందర్భంగా మహిళలు పడ్డ కష్టనష్టాలను ఆమె వివరంగా తెలియజేశారు. ‘‘మహిళా ఉద్యోగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలు, పథకాల ఫలితాలు మహమ్మారి కారణంగా ఒక్క ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయాయి’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.