ఇక విధానాల మీదే దృష్టి.. ఆరు నిర్ణయాలకు బైడెన్‌ అత్యంత ప్రాధాన్యం

US President Joe Biden Administration Policies

వాషింగ్టన్‌ః డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానంపై విచారణ పూర్తి కావడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇక తన విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించారు. దేశాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి బైడెన్‌ ప్రధానంగా ఆర్థిక ఉద్దీపన పథకం, కరోనా వ్యాక్సినేషన్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన కొన్ని విధానాలను ఉపసంహరించడం అటుంచి, బైడెన్‌ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, వలసలు వంటి మరికొన్ని అంశాల మీద కూడా దీక్షాదక్షతలతో పని చేయాలని నిర్ణయించుకుంది.

కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ డెమోక్రాట్లకు తగినంత సంఖ్యాబలం ఉన్నందువల్ల, బైడెన్‌ ప్రభుత్వానికి ఆర్థిక ఉద్దీపన పథకానికి ఆమోదం పొందడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందరూ కలిసి పని చేయడం వల్ల దేశం మళ్లీ పట్టాల మీదకు ఎక్కే అవకాశాలు మరింత ఎక్కువవుతాయంటూ అధ్యక్ష పదవికి జరిగిన ప్రచారంలో బైడెన్‌ పదే పదే సూచించడం వల్ల, ఈ ఉద్దీపన పథకానికి సంబంధించినంత వరకూ ఆయన పార్టీ ప్రభుత్వానికి రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. అవసరమైతే రిపబ్లికన్ల సిఫారసులు, సూచనలను కూడా ఈ పథకంలో చేర్చడం జరుగుతుందని ఇటీవల జరిగిన చర్చల్లో ఆయన సూచించడం జరిగింది.

ప్రస్తుతం ఆ ఉద్దీపన పథకాన్ని కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. పెనేట్‌లో డెమోక్రాట్లు కేవలం 51 ఓట్లతో ఈ పథకానికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించిన పథకాన్ని కూడా బైడెన్‌ పార్టీ ప్రవేశపెడుతోంది. కరోనా వైరస్‌ను నిరోధించడంలో ట్రంప్‌ ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేకుండాపోయిందని బైడెన్‌ ప్రభుత్వం, డెమోక్రాటిక్‌ పార్టీ ఇప్పటికీ ఆక్షేపిస్తూనే ఉంది. జూలై 30 నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి వీలైనన్ని డోసులు తమ వద్ద ఉన్నాయని అధ్యక్షుడు, ఆయన ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు మరీ మరీ చెబుతున్నారు. తమ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

వైరస్‌కు సంబంధించి ప్రభుత్వం ముందున్న మరొక పెద్ద సవాలు విద్యాసంస్థలను పునఃప్రారంభించడం. ఈ వైరస్‌ ఉన్నప్పటికీ విద్యాసంస్థలను పునఃప్రారంభించాలన్న బైడెన్‌ ఆలోచనకు అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఇందుకు ససేమిరా అంటుండగా, ప్రభుత్వంలోని అధికారులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణంపై ప్రత్యేక శ్రద్ధ

అధ్యక్ష పదవిని చేపట్టగానే బైడెన్‌ ప్యారిస్‌ వాతావరణ ఒప్పందాలలో మళ్లీ చేరారు. వాతావరణానికి హానికరమనే ఉద్దేశంతో ఆయన ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన కొన్ని విధానాలను రద్దు చేశారు. వాతావరణం మార్పునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన తన ప్రభుత్వంలోని అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. అమెరికా వంద శాతం 'క్లీన్‌ ఎనర్జీ ఎకానమీ'గా మారాలనేది తన లక్ష్యమని బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. 2050 లోగా దేశం కాలుష్యరహిత దేశంగా అవతరించాలని ఆయన అన్నారు. ఆయన ప్రభుత్వం ఇప్పటికే దేశాన్ని 'పచ్చని' దేశంగా మార్చడానికి కార్యక్రమాలు రూపొందిస్తోంది.

బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన సన్నిహితులు కొందరు ఆయన మనోభావాలను వివరిస్తూ, అధికారానికి వచ్చిన ఏడాది లోగా ఒక భారీ ప్రాథమిక సదుపాయాల కల్పనా పథకాన్ని బైడెన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభల ముందుంచనున్నట్టు తెలిపారు. ఆర్థికంగా దేశాన్ని పునరుద్ధరించాలనే దృఢ సంకల్పంతో ఉన్న బైడెన్‌ పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ, ప్రాధమిక సదుపాయాల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది కూడా ఆర్థికాభివృద్ధిలో భాగమేనని తెలిపినట్టు తెలిసింది.

వాతావరణానికి ప్రాధాన్యమిస్తూ ప్రాధమిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయడానికి ఆయన ఒక భారీ పథకాన్ని రూపొందించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఈ పథకాన్ని ఆయన అమెరికా గ్రీన్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పరిగణించేవారు. ఇందులో భాగంగా భారీగా రోడ్లు, భవనాల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని అధికారులు వివరించారు. బ్రాండ్‌బ్యాండ్‌ను విస్తరించడం కూడా ఇందులో భాగమే. దీనికంతటికీ కాంగ్రెస్‌ ఆమోదం తెలియజేయాల్సి ఉంది. ఆర్థిక ఉద్దీపన పథకంతో పాటే ఈ పథకం మీద కూడా రిపబ్లికన్లతో చర్చలు జరుగుతున్నాయి.

ప్రాథమిక సదుపాయాలకు పెద్ద పీట

ఒక పది రోజుల క్రితం వైట్‌హౌస్‌ కార్యాలయంలో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రవాణా శాఖ మంత్రి పీట్‌ బటిగీగ్‌, సెనేటర్లలోని ద్వైపాక్షిక బృందం సభ్యులు, అధికారులు, నిపుణులు సమావేశమై, రవాణా సౌకర్యాల మెరుగుదలతో సహా వివిధ ప్రాధమిక సదుపాయాల కల్పన గురించి విస్తృతంగా చర్చించారు. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్‌పై వారం రోజుల క్రితం మేయర్‌లు, గవర్నర్లతో బైడెన్‌ సమావేశం జరిగింది. అది ముగిసిన తర్వాత ఆర్కెన్సాస్‌ రిపబ్లికన్‌ పార్టీ గవర్నర్‌ అసా హచిన్‌సన్‌ ఒక ప్రకటన చేస్తూ, ''ప్రాధమిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన బిల్లుపై కూలంకషంగా చర్చ జరిగిందని వివరించారు.

ఇక బైడెన్‌ అధికారంలోకి వచ్చీ రాగానే, వలసలకు సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేస్తూ కొన్ని ఉత్తర్వులపై సంతకాలు చేశారు. పిల్లల రాకపై నిషేధం, అడ్డుగోడల నిర్మాణం, ముస్లింల ప్రవేశంపై ఆంక్షలు వంటి విధానాలకు కూడా ఆయన స్వస్తి చెప్పారు.

దేశంలోకి వచ్చే శరణార్థుల సంఖ్యను 15,000లకు కుదిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన వెంటనే రద్దు చేశారు. ఈ సంఖ్యను ఏడాదికి 65,000 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్‌ విధానాల కారణంగా మెక్సికోలోనే ఆగిపోయిన శరణార్థులను అమెరికాలోకి అనుమతించడానికి కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి మరి కొంత కాలం పడుతుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

వలస విధానానికి సంబంధించిన బిల్లును అమలు చేయాలంటే కాంగ్రెస్‌ ఆమోదం తప్పనిసరి. దీన్లో భాగంగానే సరిహద్దు భద్రత, లాటిన్‌ అమెరికాకు విదేశీ ఆర్థిక సహాయం, అమెరికాలో విదేశీయులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం వంటి అంశాలను అమలు చేయాల్సి ఉంది.

అందరికీ ఆరోగ్య సంరక్షణ

ఇది ఇలా ఉండగా, దేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన చర్యలను విస్తారం చేయాలని కూడా బైడెన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా అఫోర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ని మెరుగుపరచాలని కూడా ఆయన భావిస్తున్నారు. వైద్య సౌకర్యాల మెరుగుదల, గర్భస్రావాలపై ఆంక్షల తొలగింపు, చౌకగా మందుల సరఫరా, ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సంరక్షణ హక్కులు వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆరోగ్య బీమా చేయించుకోని అమెరికన్లను కూడా అఫోర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ కిందకు తీసుకు వచ్చి, వారికి మూడు నెలల పాటు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించే కార్యక్రమం గురించి కూడా ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. బైడెన్‌ తలపెట్టిన చర్యలలో కొన్నిటిని కేవలం ఉత్తర్వుల ద్వారా అమలు చేయవచ్చు. కానీ, అఫోర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ వంటి వాటికి తప్పనిసరిగా కాంగ్రెస్‌ ఆమోద ముద్ర ఉండాలి.

అందరినీ, అన్ని వర్గాలనూ కలుపుకునిపోవాలన్నది తన అభిమతమని బైడెన్‌ అనేక పర్యాయాలు ప్రకటించారు. జాతి, మతం, స్వదేశీయులు, విదేశీయులు, స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా అందరినీ కూడగట్టుకుని అమెరికా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. చివరికి ట్రాన్స్‌జెండర్లకు కూడా అవకాశమివ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.

 

- డాక్టర్ దుర్గ వడ్లమాని 

 

 


                    Advertise with us !!!