టిటిఎ కార్యక్రమాలతో తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తా - మోహన్ పాటలోళ్ళ

TTA President Mohan Patalolla Interview

తెలంగాణ సంస్కృతిని విధంగా పెంపొందిస్తున్నారు?

తెలంగాణ సంస్కృతి, భాష అమెరికాలోని నేటితరానికి, ఇతరులకు తెలియజేసేలా కార్యక్రమాలను టీటిఎ చేస్తోంది. మన ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలే మన గొప్పదనాన్ని తెలియజేస్తాయి. దాంతోపాటు మనం నిర్వహించుకునే పండుగలు, కళలు మన వైభవానికి తార్కాణాలు. ఇలాంటి గొప్ప వైభవాన్ని నేటితరంతోపాటు, భావితరాలకు కూడా అందించే దిశగా టీటిఎ కార్యక్రమాలను చేస్తోంది. పండుగలను సామూహికంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను వైభవంగా చేయడంతో  అమెరికా అంతటా ఈ పండుగలను చేసుకునేలా టీటిఎ కృషి చేస్తోంది. అలాగే టీటిఎ మహాసభల్లో తెలంగాణ సాంస్కృతిక వేడుకలను వైభవంగా నిర్వహించడంతోపాటు, కళాకారులను తెలంగాణ నుంచి అమెరికాకు రప్పించి వారి చేత ప్రదర్శనలను కూడా ఇప్పిస్తున్నాము. స్థానిక తెలంగాణ కళాకారులను కూడా గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలను చేస్తాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ సంస్కృతి, వైభవం నేడు ఎల్లెడలా విస్తరిస్తోంది.

టిటిఎ లక్ష్యాలేమిటి?

తెలుగు కళలతోట, తెలంగాణ సేవల కోట అనే థీమ్‍తో తెలంగాణ కమ్యూనిటీకి సేవ చేయాలన్న లక్ష్యంతో ఏర్పడిన   తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అటు అమెరికాలోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతికోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ పథకాలకు, కార్యక్రమాలకు తనవంతుగా ఆర్థిక చేయూతను అందిస్తూ , రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తోంది. అమెరికాలోని తెలంగాణ కమ్యూనిటీకోసం వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదుకుంటోంది.

కమ్యూనిటీకి విధంగా తోడ్పడుతున్నారు?

కమ్యూనిటీకి సహాయం చేయడంలో టీటిఎ ఎల్లప్పుడూ ముందుంటోంది. దేశం కాని దేశంలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా వారికి ఒక స్నేహితుడిలా తోడుండాలని, ఆప్తులమై ఆదుకోవాలనే లక్ష్యంతో వారికోసం అత్యవసర సేవా విభాగాన్ని  1-800 ఏర్పాటు చేసింది. వీసా విషయంలో అవసరమైన సలహాలు ఇమ్మిగ్రేషన్‍ లాయర్ల చేత ఇప్పించేందుకు వీలుగా అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. అలాగే గృహహింస వంటి అనైతిక అంశాలపై న్యాయపరమైన సలహాలను, సూచనలను అందిస్తోంది. ఉన్నత చదువులకోసం నార్త్ అమెరికాకు వస్తున్న తెలుగు విద్యార్థులకు సాంకేతిక, వ్యాపారరంగంలో శిక్షణ అందించడం, సైన్స్ వంటి ఉద్యోగ అంశాల్లో అవగాహన కల్పించడం వంటివి చేస్తున్నాము.

భవిష్యత్తు కార్యక్రమాలేమిటి?

ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో టీటిఎ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యసేవా కార్యక్రమాలను 2021 సంవత్సరంలో కూడా భారీగా నిర్వహించనున్నాము. అంగరంగ వైభవంగా నిర్వహించే తెలంగాణ అమెరికన్‍ తెలుగు సంఘం కన్వెన్షన్‍ను మే నెలలో 2022 సంవత్సరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాము. యువకులు, విద్యాధికులు, ఉత్సాహవంతమైన కార్యనిర్వహణ సభ్యులతో, బోర్డ్ ఆఫ్‍ డైరెక్టర్లతో, స్టాండింగ్‍ కమిటీ సభ్యులతో, రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్లతో, అడ్వయిజరీ కమిటీ సూచనలతో కార్యక్రమాలు నిర్వహించి టీటిఎను మరింతగా విస్తరించడానికి కృషి చేస్తాను.

 


                    Advertise with us !!!