కమలా హారిస్ కు 'పౌర హక్కుల' వేడి!

Kamala Harris will still face pressure on civil rights

ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు అమెరికాలోని నల్లజాతీయులు. నల్ల జాతీయురాలైన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన దేశంలోని తమవారి సమస్యలన్నీ పరిష్కారమైనట్టు కాదని వారు భావిస్తున్నారు. ఆమె ఉపాధ్యక్షురాలి పదవిని చేపట్టడం కేవలం ప్రారంభం మాత్రమేనని, సమస్యలకు ఇది ముగింపు కాదని వారంటున్నారు. ఆమె ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ దేశంలోని ప్రముఖ పౌర హక్కుల సంస్థలన్నీ సమావేశమై, ఓ నల్లజాతీయురాలికి ఇంతటి గౌరవం దక్కడం పట్ల హర్షాతిరేకాలు, భావోద్వేగాలు వ్యక్తం చేశాయి. కానీ, తాము భావోద్వేగం చెందడానికి ఇది సమయం కాదని, జో బైడెన్‌ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తప్ప తమ సమస్యలు పరిష్కారం కావని అవి ఆ తర్వాత భావించాయి.

జాతి వివక్ష, అసమానతలు, పౌర హక్కులు వంటి సమస్యల విషయంలో తక్షణ పరిష్కారాన్ని బైడెన్‌ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని, వీటిపై కమలా హారిస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని అవి ఆశిస్తున్నాయి. కరోనా వైరస్‌, ఆర్థిక రంగ పతనం, వాతావరణ మార్పు వంటి అంశాలకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న బైడెన్‌ ప్రభుత్వం తమ సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్‌, కమలా హారిస్‌ల ప్రభుత్వం తమ ఓట్లతో విజయం సాధించారని, తమను విస్మరిస్తే దానికి పుట్టగతులుండవని పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. కమలా హారిస్‌కు ఈ పౌర హక్కుల సంఘాలు మున్ముందు మరింత వేడి పుట్టించే సూచనలు కనిపిస్తున్నాయి.

 


                    Advertise with us !!!