కరోనా కాలంలో 'కుబేర' యోగం

Wealth increase of 10 men during pandemic could buy vaccines for all

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. అనేక దేశాలు ఆర్థికంగా ఇక కోలుకోలేనంతగా చితికిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 22 కోట్ల 50 లక్షల ఉద్యోగాలు హుష్‌కాకి అయిపోయాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ) తన తాజా నివేదికలో వెల్లడించింది. కానీ, ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒక దారి అన్నట్టు, కొందరు సంపన్నులు మాత్రం కుబేరుడిని మించిపోయినట్టు గత సోమవారం విడుదల అయిన ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని పది మంది అగ్రస్థాయి సంపన్నులు 500 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సొమ్మును సంపాదించుకున్నారట. ఈ సొమ్ముతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయించవచ్చు. ఇంకా ఎన్నో మంచి పనులు కూడా చేయవచ్చు.

కరోనా వైరస్‌ వల్ల ప్రపంచానికి జరిగిన నష్టమేమిటంటే, తీవ్రస్థాయిలో ఆర్థిక అసమానతలు పెరగడం. భవిష్యత్తులో ఈ అసమానతలు మరింత పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో పేదరికం కరోనా ముందు నాటి స్థితికి రావాలంటే మామూలు కంటే 14 రెట్లు ఎక్కువ సమయం పడుతుందని ప్రపంచ కార్మిక సంస్థ అంచనా. యువత ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోవడం ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన యువతుల సంఖ్య యువకుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. 15 నుంచి 24 ఏళ్ల లోపు యువతీ యువకులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడాన్ని బట్టి, కరోనా ప్రభావం తదుపరి తరం మీద కూడా పడే అవకాశం ఉందని కార్మిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థికంగా కరోనా ప్రభావం 2021లో కూడా కొనసాగే అవకాశం ఉందని అది తెలిపింది. ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడడానికి మరో దశాబ్ద కాలం పట్టవచ్చు. సుమారు 1,000 మంది ప్రపంచ స్థాయి సంపన్నులు కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోగా, పది మంది సంపన్నులు 500 బిలియన్‌ డాలర్లకు పైగా కూడబెట్టుకోగలిగారని అది తెలిపింది.

 


                    Advertise with us !!!